Thursday, January 1, 2015

చోరీయణం!

రోజు, తారీఖు, ఆ వేళ ఉష్ణోగ్రత, అప్పుడు నా బరువు గుర్తు లేవు కానీ ఒక రోజు తెల్లవారుఝామున తొమ్మిదింటికి ఫోన్ మోగింది. ఈ ఫోన్ కి వేళా పాళ ఉండదు. ఎవడు ఏ టైం లో చేసినా మోగి చస్తుంది. అసలే మాంచి నిద్రలో ఉన్నాను. పీక నొక్కేసి పడుకున్నాను. మళ్ళీ మోగింది.

చిరాగ్గా ఫోనెత్తి "హలో" అన్నాను.

"ఏరా? బలిసిందా?" అన్నాడొకడు.

"బలిసానో లేదో వచ్చి చూస్కోరా తింగరెదవ. ఫోన్ పెట్టేయ్" అన్నాను.

"ఒరే నేను రా వాసుని. ఏంటేంటో వాగుతున్నావ్, ఏంటేంటో రాస్తున్నావ్? తిక్క లేచిందా??" అన్నాడు ఫ్రెండ్ వాసు.

"పొద్దున్నే నువ్వు తాగేసి, నువ్వే వాగేసి నన్ను అంటావేంటి . ఫోన్ పెట్టేసేయ్యేహే" అని కసిరి ఫోన్ పెట్టేశాను.

మళ్ళీ కాసేపటి తర్వాత ఫోన్ మోగింది. ఏదో వేరే దేశం కోడ్ తో ఉంది. వెంటనే లేచి కళ్ళు తుడుచుకుని, వేరే దేశం కోడ్ తో నెంబర్ వస్తే ఎలా కనపడతుందో పూజలో ఉన్న అమ్మకి చూపించి ఫోన్ ఎత్తాను. అప్పటికే కాల్ కట్ అయింది. ఇవ్వాళేమిటో అందరికి నేనే కావాల్సి వచ్చాను, రోజు బాగుందేమో మనకి అనుకున్నాను. మళ్ళీ మోగింది నేను అనుకున్నది నిజం చేస్తూ!

అవతల సాయి గాడు ... అమెరికా నుండి!

"ఏరా టెన్షన్ పడమాక. ఎలాగోలా సర్దేస్తాం. నేను అందరి నంబర్స్ తవ్వుతున్నాను. తలా కొంచెం పంపుతాం లే." అన్నాడు.

"ఏంటి అందరూ తాగేసారా ఏంటి? ఎవడు పడితే వాడు ఫోన్ చేసి దొబ్బేస్తున్నారు" అన్నాను.

"తాగుడేంది రా... నువ్వు లండన్ లో లేవా... నీ డబ్బులు పోయినాయి... ఎవడో పీక మీద  కత్తి పెట్టి మొత్తం లాగేసాడు అని చాటింగ్ లో చెప్పావ్ కదరా. వైర్ చేయమని నెంబర్ కూడా  ఇచ్చావ్! మేము డబ్బులు అందుకే సర్డుతున్నాం"

"నేను చాటింగ్ చేసి చాలా కాలమైంది రా.. స్పెల్లింగ్ కూడా గుర్తు లేదన్నాను"

"మరి ఏ పకోడీ గాడు చాటింగ్ చేసాడు... అర్ధమైంది... నీ జిమెయిలు ఉందా దొబ్బిందా?" అనడిగాడు.

దెబ్బకి నిద్ర మత్తు వదిలి, మళ్ళీ ఫోన్ చేయమని చెప్పేసి, లాప్టాప్ ముందరేసుకుని కూర్చున్నాను.

ఇంటర్నెట్ కనెక్ట్ అవటం లేదు. లాప్టాప్ సమస్యేమో అనుకుని రీస్టార్ట్ చేద్దామంటే ఎలాగో తెలియటం లేదు, హైబర్నేషన్ అలవాటై పోయి!! ఏంటో టెన్షన్ లో ఉంటే దేనికీ అటెన్షన్ ఉండి చావదు. సాయి గాడు  ఫోన్ చేస్తే, లాప్టాప్ ఎలా రీస్టార్ట్ చేయాలో కనుక్కుని, చివరికి ఎలాగోలా రీస్టార్ట్ చేశాను. అయినా ఇంటర్నెట్ కనెక్ట్ అవటం లేదు. అప్పుడు  చూస్తే తెలిసింది.ఇంటర్నెట్ అసల ఆన్ చేయనే లేదని. స్విచ్ వేసిన  తర్వాత ఇంటర్నెట్ కనెక్ట్ అయింది ... కరెంటు పోయింది!

చచ్చినోడి పెళ్ళికి మంటపం అంతా శవాలేనంట. అలా ఉంది పరిస్థితి నాది. నాకు సందేహం కూడా వచ్చింది. నా పాస్వర్డ్ దొబ్బేసినోడు ఖచ్చితంగా కరెంటు ఆఫీసులో పని చేస్తున్నాడని. విజయదరహాసం (మూతి పైన) మెరిసింది. వెంటనే కరెంటు వచ్చింది. మెరుపు మాయమైంది!!

ఏడుపు, నవ్వు కలగలసిన నా మొహం చూసి అమ్మ వీడికేదో అయిందనుకుంది! మా అమ్మకి ఈమెయిలు లేదు జిమెయిల్ లేదు ఉంటే తెల్సేది ఆ బాధేంటో!

అప్పుడే సుందరి ఫోన్ చేసింది! సుందరి నాతోపాటు చదువుకుంది.

"ఏటి కాంతారావా! నీ మెయిల్ పాస్వర్డ్ పోయిందంట కదా! ఎంత పని జరిగింది. నాకు చాలా టెన్షన్  గా ఉంది" అంది.

"నా పాస్వర్డ్ పోతే నీకెందుకు టెన్షన్" అనడిగాను.

"మొన్న నీకు నా సివి పంపాను కదా! మరి ఉండదా?"

"నీ పేరు బదులు వాడి పేరు మార్చుకుని  కంపెనీ కి ఉద్యోగానికి పంపిస్తాడా ఏంటి హ్యాకర్?" అన్నాను వెటకారంగా!

"అబ్బ!  కాదయ్యా!! అందులో నా పుట్టిన తేది వివరాలు ఉన్నాయి కదా?"

"ఉన్నాయా? అసలు ఎవడైనా సివి లో డేట్ అఫ్ బర్త్ రాస్తాడా... అది సివి నా లేక పెళ్ళికి పంపే బయో డేటా నా?"

"ఎలా ఉందో చూసి, సలహా ఇస్తావనే కదా నీకు పంపాను. నువ్వు అది కూడా చూడలేదా. నువ్వు లటుక్కు మన!!" అని తిట్టింది.

"సర్లే గానీ  ఇపుడు నీకు టెన్షన్ దేనికి?"

"నా వయసు తెల్సిపోదు ఆ వెధవకి. అందుకే  నా టెన్షన్ " అన్నది.

"భూమి పుట్టినప్పుడు బారసాలకి నిన్ను పిలిచారంట  కదా.. నీ వయసు ఎవడిక్కావాలి?" అని కసిరాను.

"నువ్వు అమ్మాయి అయి ఉంటె నీకు తెల్సేది..."

నాకు పిచ్చ లేచింది. ఇల్లు తగలబడి ఒకడేడుస్తుంటే వాడింటి మీద ఆరబెట్టిన వడియాలు కాలిపోయాయని ఎదురింటావిడ ఏడిచిందట. అలా ఉంది నా పరిస్థితి!

ఏదో ఒకటి చెప్పేసి సుందరి కాల్ కట్ చేసాను. అసలే కాలు చెయ్యి ఆడటం లేదు దానికి తోడు గాలి కూడా ఆడటం లేదేమో చెమట పట్టేసింది. "వీడు" ఎవడెవడితో చాటింగ్ చేస్తున్నాడో, అసలు వీడు "వీడో" లేక  "అదో", డబ్బులు ఎవరన్నా పంపేసారేమో పాపం అనుకుంటూ ఉన్నాను. అప్పుడే అప్పటిదాకా నిద్రపోతున్న మెదడు లేచి పని చేయటం ప్రారంభించింది.

మీరు ఎప్పుడన్నా గమనించారో లేదో, దురదృష్టం అనే పదం లో దురద ఉంటుంది. దురదృష్టం మనతో ఉన్నప్పుడు మనకు దురద ఎక్కువగా ఉంటుంది. చేయాల్సిన పనులు తెల్సు గాని, ఏవేవో పనులు గెలుక్కుంటూ గోక్కుంటూ కంపు కంపు చేస్కుంటూ ఉంటాం.

గూగుల్ లో కెళ్లి, "పాస్వర్డ్ రీసెట్ చేయటం ఎలా?" అని టైపు చేసి, దురద కొద్దీ "నేను అదృష్టవంతుడిని" అని మీట నొక్కాను. ఏదో పేజి తెరుచుకుంది, "అనువదించమంటారా?' అని బ్రౌజరు అడిగింది, మళ్ళీ గోక్కున్నాను(అంటే సరే అన్నాను అని అర్ధం). తెలుగు లో  "పాస్వర్డ్ రీసెట్ చేయటం ఎలా?" అని హెడ్డింగ్ తో పేజి ఉంది. ఆ లింక్ క్లిక్ చేస్తే ఈమెయిలు అడిగింది.. ఈమెయిలు అడ్రస్ ఇచ్చాక మీ పాస్వర్డ్ రీసెట్ చేయాలంటే క్రెడిట్ కార్డు డీటెయిల్స్ అడిగింది. అవి కూడా ఇచ్చాక నా ఫోన్ కి మెసేజ్ వచ్చింది... వంద డాలర్స్ జింగారోజింగ.కామ్ లో ఖర్చుపెట్టినట్టు! ఆశ్చర్యపడి లాప్టాప్ లో చూస్తే - మళ్ళీ రీసెట్ చేయాలంటే ఇక్కడ నొక్కండి అని! ఇంక ఏమి లేదు... డబ్బులు తీస్కుని కూడా వీడు రీసెట్ చేయలేకపోయాడంటే హాక్ చేసినోడు మామూలోడు కాదనుకుంటా!!!!!?


మళ్ళీ గూగుల్ కొచ్చాను. భూమే కాదు నెట్ కూడా గుండ్రమే. చుట్టూ తిరిగి అందరం గూగుల్ కి వచ్చెవాళ్ళమే! మళ్ళీ ఇంకేదో లింకు నొక్కాను. ఏదో డౌన్లోడ్ అయింది. మాటి మాటికి మీ కంప్యూటర్ రిపేర్ చేయమంటారా - అక్కడ నొక్కండి ఇక్కడ నొక్కండి అని ఒకటే గోల! చిరాకేసి కంప్యూటర్ పీక నొక్కేసి పక్కన పడేసాను.

మా అమ్మ పూజల ఫలితమో లేక చిన్నప్పుడు టీవీ లో రామాయణం చూసిన పుణ్యమో తెలీదు కాని బుర్ర ఇంకా పని చేస్తూనే ఉంది. ఎప్పుడో రెండు నెలల కింద బెంగుళూరు లో సైబర్ క్రైమ్ సెల్ పెట్టారని గుర్తొచ్చింది(మీకు నమ్మకం లేకపోతే మళ్ళీ చదువుకోండి.... మన దేశం లో కూడా అప్పుడప్పుడు విచిత్రాలు జరుగుతా ఉంటాయి మరి!!)

బైక్ కీస్ తీస్కోకుండా జర్రున ఇంట్లో నుండి బయటకి వచ్చి బర్రున పోతున్న ఆటో ని ఆపాను!

"ఎక్కడికి?" అన్నాడు ఆటోవాలా.
"సైబర్ క్రైమ్ సెల్" అని అరిచినంత పని చేసాను. వాడు పెద్ద క్రిమినల్ ఏమో మరి, "క్రైమ్" అని వినగానే మారు మాటాడకుండా వేగంగా వెళ్ళిపోయాడు.

మీకు సందేహం వచ్చిందా? నేను బైక్ కీస్ ఎందుకు తీస్కోలేదా అని?  బెంగుళూరు లో ఉండేవాళ్ళు అయితే వీడు బైక్ తీస్కోకుండా ఆటో ఎందుకు అడుగుతున్నాడు అని అడగరు. వేరే వూరు వాళ్ళు అయితేనే ఆ సందేహం!

బెంగుళూరు లో రోడ్ల మీద కొంచెం ఖాళీ ఉంటే బస్సు వెళ్తుంది. మరి కొంచెం తక్కువ ఖాళీ ఉంటె కార్ వెళ్తుంది. ఇంకా తక్కువ  ఉంటె బైక్ వెళ్తుంది. ఇంకా తక్కువ ఉంటె ఆటో వెళ్తుంది. ఆటోలు తెగ కనపడతాయి. వెంట పడతాయి కాని అడిగిన చోటుకి మాత్రం రావు. మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేస్తాను. అన్నట్టు ఇంకో జోక్ - బెంగుళూరు లో రాయి విసిరితే కుక్కకి కాని సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి కాని తగులుతుందట!! ఈ జోక్ నాకెప్పుడో రాయి తగిలితే మా ఫ్రెండ్ చెప్పాడు!

ఇంకో ఆటో కోసం ఎదురు చూస్తుండగానే తళతళ లాడిపోతూ ఆటో వచ్చి ఆగింది. ధవళ వస్త్రాలు (అంటే ఖాకి రంగు కదూ?) వేస్కోని దేవుడి లాగా ఆటోవాలా దిగాడు. "ఎక్కడికి సార్?" అన్నాడు. "సైబర్ క్రైమ్ సెల్" అని భయపడుతూ చెప్పాను.

"మీకు దారి తెల్సా?" అన్నాడు. ఓ యస్ అన్నాను.
అయితే ఎక్కండి అన్నాడు. ఒక్క దూకులో ఎక్కేసాను.
దేవుడు కూడా ఎక్కాడు. దేవుడిలా దొరికారండి అన్నాను. చెప్పిన చోటుకు రాను అనకుండా తీస్కెళ్ళె ఆటోవాడే దేవుడు అని నా నిర్వచనం.
క్రైమ్ సెల్ కి వెళ్ళాక, హుండీ లో డబ్బులు ఎక్కువ వెయ్యమన్నాడు! హడావిడి లో మీటర్ వేసినట్టు లేదు (దేవుడు తొండి చేశాడు)! ఎలాగోలా దర్శనం చేస్కుని క్రైమ్ సెల్ కి వెళ్లాను.

కుర్చీ లో ఒకాయన నిద్రపోతున్నాడు. ఆయన్ని చూస్తే దాచేస్తే దాగనిది నిజం కాదు పొట్ట అనిపించింది!! తట్టి లేపాను ... కొట్టి లేపినంత కోపంగా చూసాడు! నా మెయిల్ హాక్ అయింది అన్నాను. చిరాగ్గా చూసి ఒక ప్రింటౌట్ ఇచ్చి నిద్ర లోకి జారుకున్నాడు(ఆయన బరువుకి తొందరగానే జారిపోయాడులెండి). అందులో కొన్ని పాయింట్స్ ఉన్నాయి:

1. ఈమెయిలు హాక్ అవ్వకుండా ఉండాలంటే తరచుగా లాగిన్ అవ్వకండి
2. పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు అటు ఇటు పైకి కిందకి చూస్కుని ఇవ్వండి.
3. కుదిరితే ఉత్తరాలు రాయండి... కుదరకపోతేనే ఈమెయిలు చేయండి.
...
ఇంక ఆ తర్వాత నేను చదవలేదు!! నన్నొచ్చి తీసుకెళ్ళమని మా ఫ్రెండ్ కి ఉత్తరం రాసి అక్కడ కూలపడ్డాను!