Friday, January 10, 2014

నేను నా స్కూలింగు - 1

ఇంగ్లీష్ లో బోల్డు పదాలు నాకు తెల్సు గాని...స్కూలింగ్ అంటే  అర్ధమెంటో  ఈ మధ్యనే తెల్సింది! అసలు అర్ధం తెల్సేవరకు స్కూలింగ్ అంటే స్కూల్ కి  వెళ్ళటమే అనుకునేవాడిని...మీకు కుడా తెలీకపోతే డిక్షనరీ చూస్కోండి... నాకు అందులో చూస్తే అర్ధం కాలేదు! అర్ధమైన దాని ప్రకారం రాసుకుంటూ పోతున్నా .... మీరు చదువుకుంటూ వచ్చేయండే!


నాకు "ఊహ" తెలిసే సరికి  పదో తరగతి లో ఉన్నా...(అప్పుడే 'ఆమె' సినిమా చుసాలే... అహహ...  చూపించారులే )అప్పటిదాకా ఎలా చదివానో తెలీదులెండి...పదో తరగతి లో భయంకరంగా బట్టీలు పట్టేసి వాటి వల్ల మెడలు పట్టేసి మన రాష్ట్రం లో నే  ఫస్ట్ వచ్చా! తర్వాతే తెల్సింది స్కూల్ ఫస్ట్ అని..మన రాష్ట్రం లో వేరే స్కూల్స్ ఉన్నాయని...ఒక్క స్కూలే ఉంటె ఎంత బాగుండేది...తస్సాదియ్యా..!

పదో తరగతి పరీక్షలు అయ్యాక నన్ను అడిగారు..."ఎరా? ఏమవుదామనుకుంటున్నా? " అని... నేనేమో నోటికి వచ్చింది వాగేశా... మా అమ్మ నాన్నల కళ్ళల్లో దీపావళి కాంతులు చూసా...అపుడే అర్ధమైంది చాలా సోది చెప్పానని...వెంటనే ఆపేసా!

మా వాళ్ళు యేవో ఏవేవో ఇంకేవో మరేవో మాట్లాడేస్కుని...నన్ను ఇంటర్ లో M.P.C గ్రూప్ లో పడేసారు...అపుడర్ధమైంది నా సొల్లు ఉరఫ్ సోది కి ప్రతిఫలం  జూనియర్ కాలేజీ లో లెక్కలు, రసాయనాలు మరియు భౌతిక శాస్త్రాలు చదవాలని...

ఇంతకి నేను వాళ్లకి వేసిన సోది ఏమిటంటారా...దూలగా ఉంటె చదువుకోండి...మళ్ళీ నన్ను తిడితే బాగోదు...
1.  దేశం గర్వించదగ్గ మనిషినవ్వాలి...(అమ్మ నాన్న కళ్ళల్లో కాకరపువ్వొత్తుల కాంతి..)
2.  గొప్ప శాస్త్రవేత్తనవ్వాలి... (మతాబులు కూడా తోడు అయ్యాయి)
3.  నోబెల్ బహుమతి రావాలి...(50000 వాలా )
4. ఇంక నేను ఆపేసా...(కరెక్ట్ గా చెప్పాలంటే నాన్న అనుమానంగా చూసాడు)
మీకు పాయింట్లు చెప్పా కాని...వాళ్ళతో చాలా చెప్పా...ఈ వయసులో ఇలాంటి ఉద్యోగం చేస్తూ అలాంటి మాటలు ఇపుడు చెప్పాలంటే ఎవడికి గుర్తు...నన్ను వదిలేయండి బాబు... ఇప్పటికి అమ్మ అంటూ ఉంటుంది నీకు ఉద్యోం ఇచ్చిన వెధవ ఎవడ్రా అని .... చెప్తామా ఏంటి?

పదవ తరగతి పాసయ్యాక ఉద్యోగం ఏమి రాలేదు ... ఇంకా ఎక్కువ చదవాలి కాబోలు అనుకుని ఇంటర్మీడియట్ చదువుదామని నిర్ణయించుకున్నా... అది కూడా ఆంగ్ల మాధ్యమం లో (ఇంగ్లీష్ మీడియం అని అంటున్నారు ఇపుడు తెలుగులో)

ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో(ఆంగ్ల మాధ్యమం కదా కొంచెం తెంగ్లిష్ వాడేను) ఉండగా ఒక రోజు మా ఫ్రెండ్ నన్ను "ఒరేయ్! projectile అంటే ఏంది రా?" అనడిగాడు...నేనేమో "అబ్బ నాకు అర్జెంటు పని ఉంది రా" అని చెప్పేసి ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయా ..లేకపోతే ఎవరైనా గొప్ప శాస్త్రవేత్తని పట్టుకుని అలాంటి చిన్న ప్రశ్నలు అడుగుతారా..?

పదవ తరగతి దాకా తెలుగు మాధ్యమంలో చదివిన నాకు ఒక్కసారిగా ఇంగ్లీష్ మీడియమ్ లొ చదవాల్సి వచ్చేసరికి ఏమీ అర్ధం అయ్యి చచ్చేది కాదు. అర్ధం అయ్యేలా పుస్తకాలు రాయరు కాలేజీ లో చెప్పరు. చెప్పినా కూడా నేను పడుకున్నప్పుడు చెప్తారు. ఇంక ఎప్పుడు అర్ధమవుతుంది. మన విద్యావ్యవస్థ భ్రశ్ఠు పట్టి పాయిందనిపించేది.
ఎవడన్నా వచ్చి డౌటు అడిగినా "నాకు అర్జెంటు పని ఉంది రా!" అని చెప్పేవాడిని.

ఇంటర్లో ఉన్నప్పుడే క్రికెట్ పిచ్చి పట్టుకుంది. తెగ ఆడెసెవాళ్ళమ్. అప్పట్లో దక్షిణాఫ్రికా టీం లో క్లుసెనెర్ అని ఆల్ రౌండర్ ఉండేవాడు. చివరి స్థానం లో బాటింగ్ కి వచ్చి బాదేసేవాడు. గెలిపించేసేవాడు. నేను కుడా మా టీం లో చివరి ప్లేస్ లో బాటింగ్ కి వెళ్ళేవాడిని. గెలిపించేసేవాడిని అవతలి టీం ని. అందుకే నాకు మా వాళ్ళు లూసెనెర్("lose"ner) అని పెరేట్టారు. అంటే అర్ధం వీడు బాటింగ్ కి వెళ్తే మనకి మ్యాచ్ పోయినట్టే.

క్రికెట్ మ్యాచ్ లు కాలేజీ లో క్లాసు లు బోర్ కొట్టినప్పుడు కూడా ఆడెసెవాళ్ళము. అలా ఆడాలంటే ముందర కాలేజీకి ఉన్న పిట్ట గోడ దూకాలి. ఒక రోజు అందరు దూకేసాక నేను కుడా పిట్ట గోడ మీద కాలు పెట్టాను. అప్పటికే కాలేజీ రౌండ్స్ లో ఉన్న మా ప్రిన్సిపాల్ ఆ ఏరియా లో అడుగు పెట్టాడు. ఇంకేముంది ఒక కాలు అడ్డంగా ఇంకో కాలు నిలువుగా దొరికిపోయాను. 

నన్ను పిలిచి  "ఎం చేస్తున్నావ్ రా" అని అడిగాడు. 
అప్పుడు నేను mentos నోట్లో వేస్కున్నాను. బుర్రలో లైటు వెలిగింది. 
"షూ లేసు కట్టుకున్తున్నానండి" అన్నాను. 
నా కాళ్ళ వంక చూసాడు. షూస్ కనపడలేదు.
నాకేమో mentos తప్పు టైం లో తిన్నానని అర్ధమైంది. చాచి లెంప మీద చెంపదెబ్బ కొట్టాడు. 
వెళ్లి క్లాసు లో పడ్డాను. క్లాసు లో ఉన్న వాళ్ళు కిసుక్కుమన్నారు. నేనేమో విసుక్కుని, చెంప రుద్దుకున్నాను. 
మళ్ళీ పిట్టగోడ దూకలేదు. 

నేనేదో కష్టపడి బట్టి పట్టి ముక్కున పట్టి (అందుకేనేమో నా ముక్కు లావుగా ఉంటుంది ఇప్పటికి )పరీక్షలు రాసి మార్కులు తెచ్చుకుంటె, నా స్నేహితులంతా నేనేదో పిస్తా అనుకునేవారు. నేనేమో బాదం పప్పేమి కాదు అనుకునెవాడిని. ఎలా"గోలా" ఇంటర్ పాస్ అయ్యాను.

మనకి ఇంటర్ లో ఏమీ అర్ధం కాలేదని ఎమ్సెట్లొ సీటు రాకపోయెసరికి అర్ధమయ్యింది. మొదట్లో ఇంటర్ చదివిన అందరికి పిలిచి సీట్లు ఇస్తారేమో అని సరిగ్గా చదవలేదు. కాని దానికి ఒక పరీక్ష ఉంటుందని తెలిసేసరికి, భయమేసి అస్సలు చదవలేదు. అసలు సీటు రావాలంటే ర్యాంకు రావాలి కదా!! చివరికి ర్యాంకుల్లేని కోటాలో ఏమన్నా సీటు ఇస్తారేమో అని కూడా ట్రై చేసి టైర్ అయ్యాను. అలాంటి కోటాలు పెట్టరు ఎందుకో?!

ఇంటర్ గట్టెక్కాక ఏమి చెయ్యాలి? అని తెగ ఆలోచించేవాళ్ళు అమ్మా,నాన్నా. నేను మాత్రం తెగ బిజిగా ఉండేవాడినిలే - తినేసి, ఆడేసి, పడుకునేసి అస్సలు టైము తెల్సేది కాదు. మా నాన్నకి నేను ఇచ్చిన దీపావళి దెబ్బ తగ్గలేదేమో, నన్ను లాంగ్ టెర్మ్ ఎమ్సెట్ కోచింగ్ లో పడేసాడు. ఎందుకంటే ఇంటికి వచ్చిన ప్రతి చుట్టం "ఏదో ఒకరోజు నీ కొడుకు ఇంజనీర్ అవుతాడు అయ్యి తీరుతాడు" అని చెప్పటమే. 

ఏదో బద్దకంగా బతుకీడుస్తున్న బాలుడిని బాగా (బ గుణింతం డైలాగు - రమణ గారు కోతి కొమ్మచ్చి లో రాసినట్టు) చదవమని, చదివి మంచి ర్యాంకు తెచ్చుకోమని, తెచ్చుకొని మంచి కాలేజీ లో మంచి సీట్ రావాలని అలా పడేసారు. మంచి సీట్ అంటే కంప్యూటర్ సైన్స్ అనమాట.ఈ రోజుల్లో అర్ధాలు వేరులెండి.  కంప్యూటర్ సైన్స్ వాళ్లకి జాబ్స్ రాకపోతే ఎలక్ట్రానిక్స్ మంచి సీట్ అని అర్ధమ్ లేదా వయసు వరస (viceversa అని ఇంగ్లిష్ లో అర్ధం!!)

ఈ లాంగ్ టర్మ్ ఉంది చూసారు, మహా మేలు చేసేసింది మనకి. సినిమాలు ఎక్కువ సతుకులు తక్కువ. ఆఖరికి "ఎవడు తొడ కొడితే రైలింజిన్ రయ్యిమని వెనక్కి వెళ్తుందో" ఆడి సినిమాలు చూసేసే స్థాయికి వెళ్ళిపోయా. ఆ రోజుల్లో "ఎవడు రైలింజిన్ తో వస్తే జనాలు ఛీ కొట్టారో" వాడి సినిమాలు ఎక్కువగా చూసేవాడిని. సినిమాలు చూడటం ముదిరిపోయి హాస్టల్ గోడలు దూకటం అలవాటై పోయింది.  ఒకరోజు గోడ దూకితే వార్డెన్ నుంచుని ఉన్నాడు గోడవతల. ఆయనెందుకు దూకాడొ అర్ధం కాలేదు. దూకినోడు ఇంకా అక్కడె ఎందుకు ఉన్నాడో అస్సలు అర్ధం కాలేదు.

కొంతమంది కళ్ళతోనే మాట్లాడేస్తుంటారు. మా వార్డెన్ కుడా అలాంటొడే అని నాకు అప్పుడు అర్ధమైంది. నా వెనకాలే మా ఫ్రెండ్ కుడా గోడ దూకాడు. మా వార్డెన్ కళ్ళు పెద్ధవైనావి. నా గుండెచప్పుడు కుడా పెద్దదైంది. నెమ్మదిగా అన్నీ అర్ధం అయినాయి కాని ఏమి చేయాలో ఏమి చెప్పాలో అర్ధం కాలేదు.

"ఎక్కడికి పోతున్నార్రా?" అన్నాడు వార్దెను.
"సినిమాకి" అన్నాడు ఫ్రెండు.
"నేను కాదండి" అన్నాను నేను.  నా జీవితం లో మొదటిసారి వెయ్యవ అబద్దం చెప్పాను.
మా ఫ్రెండు అయోమయంగా చూసాడు . నేనేమో అమాయకంగా చూసాను నువ్వేవడివో నాకు తెలీదు అన్నట్టు. వార్డెను అనుమానంగా చూసాడు వేసిన వేషాలు చాల్లే అన్నట్టు.

"మరి నువ్వెందుకు గోడ దూకావ్ రా ?" అన్నాడు వార్డెను నన్ను చూసి. 
"ఊరికేనండి, గోడెంత ఎత్తు ఉందా అసల దూకగలనా లేదా అని చూద్దామని దూకానండి" అన్నాను.  మీకు నచ్చకపోతే దూకనండి, ఇపుడే వెళ్ళిపోతాను అనేసి వెళ్లి గోడ పట్టుకున్నాను. ఆయన వచ్చి నన్ను పట్టుకున్నాడు.
మా ఫ్రెండేమో వాడికెందుకు ఈ ఐడియా రాలేదా అని తల పట్టుకున్నాడు (అలా అర్ధమైంది మరి, మనకి  మనం తప్ప అందరు వెర్రోళ్ళే కదా)

వార్డెను అక్కడే బ్లాగులో రాయాలేని  కొన్ని పదాలు వాడి సినిమాకి వెళ్ళాలనే మా ఆశలకు తూట్లు పొడిచాడు. 

"ఏమి సినిమాకి రా ?" మళ్ళీ ప్రశ్న.
"విజయేంద్ర వర్మకండి" జవాబు.
"మరి ముందే చెప్పొచ్చు కదరా, వెళ్లి రండి" అనేసి "అదోలా" నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు.
"అదోలా" నవ్వు చూసి మాకు "ఏదోలా" అర్ధమయ్యి (ఆయన విజయేంద్ర వర్మ ఫ్యాన్ ఏమో అని),సినిమాకి వెళ్ళిపోయాం.

సినిమా చూసాక అర్ధమైంది వార్డెను నవ్వుకు అర్ధమేంటో  (అదోలా not equal to ఏదోలా). 

సినిమా చూసి, దారిలోనే జండుబామ్ వాసనాచూసి, తలకు రాసి హాస్టల్ కి వచ్చాము. దారిలో మా ఫ్రెండు రైల్ ఇంజిన్ కింద తల పెట్టుకుంటానని ఒకటే గోల. ఆ ముచ్చటా కానిద్దామని వెళితే పెద్ద Q ఉంది. ఒక్క సినిమాకి ఇంత మంది బలా అనుకుని చిరాకేసి హాస్టల్ కి వెళ్ళిపోయాము. 

హాస్టల్ కి వచ్చాక వార్డెను పట్టుకున్నాడు మళ్ళీ.
"ఎలా ఉందిరా" (దూల తీరిందా అని అర్ధం)
"చావాలనిపిస్తోందండి"
"మీకు చావాలని ఉన్నప్పుడు మీకోసం కాకపోయినా మీ వాళ్ళ కోసం బతకండి రా" అన్నాడు.
అప్పుడు మా వార్డెను నాకు గీతోపదేశం చేస్తున్న కృష్ణుడిలా కనిపించాడు.  దానితో ఎంసెట్ బాగా రాసి మంచి ర్యాంకు (కాదని ఇప్పటికీ అన్నయ్య తిడుతుంటాడు) తెచ్చుకుని మంచి కాలేజీ లో (కాలేజీ వాళ్ళే చెప్పారు) మంచి సీట్ తెచ్చుకున్నా(నేనే చెప్తున్నా)

మీకు ఇంకా ఓపిక ఉంటే చెప్పటానికి చాలా ఉన్నాయి, బీటెక్ ఎంటెక్ లో చేసినవి. అవన్నీ మళ్ళీ చెప్తానే.... మళ్ళీ రెండో భాగం లో కలుద్దాం!

No comments:

Post a Comment