Sunday, June 15, 2014

పొట్టకి పలకలు....కండల్లో బంతులు...

ఈ మధ్య లావైపోతున్నావ్ అని మా ఫ్రెండ్ అన్నాడు మొన్న. పట్టించుకోలేదు నేను. ఇంటికెళ్ళి అమ్మనడిగా. సన్నగానే ఉన్నావ్ కదరా అసలు ఏమి తినటం లేదు కూడానూ అని చెప్పింది. పట్టించుకున్నాను నేను. ఆ తర్వాత రెండు రోజులకే మా కొలీగ్ ఒకమ్మాయి(బావుంటుంది) నువ్వు లావైపోతున్నావ్ కాంతారావ్ అన్నది. పట్టించుకున్నాను నేను. మనమంటే ఆసక్తి చూపించబట్టే కదా అమ్మాయి అలా అన్నది! కానీ పోను పోను షర్టు బిగుతై పోవడం మొదలైంది. పొట్ట కనిపించసాగింది. మళ్ళీ ఒక రోజు మా కొలీగ్ "లావైపోతున్నావ్! ఏమిటి పొట్టా?" అని అడిగింది. "కాదు వాచింది!" అని చెప్పి వచ్చేసాను. మనమంటే ఆసక్తి చూపించబట్టే కదా అమ్మాయి అలా అన్నది!! ఎంత ఆసక్తి ఉన్నా మరీ అలా నిశ్ఠూరంగా అడిగింది ఏమిటో ఆ పిల్ల! మనమంటే ఆసక్తి చూపించబట్టే కదా అమ్మాయి అలా అన్నది!!!

సరే కొంచెమైనా సన్నపడదామని ఆఫీసు రూటు మార్చి జిమ్ మీదుగా ఆఫీసుకి పోసాగాను! తర్వాత నెల రోజులకి ఆ అమ్మాయే నువ్వు బాగా బలిసిపోతున్నావ్ కాంతారావ్ అన్నది. బలిసిపోతున్నావ్ అన్నందుకు బాధ లేదు కాని "బాగా" అనే పదం వాడినందుకు బాగా బాధ కలిగింది. ఆ బాధలో ఇంకొంచెం ఎక్కువ తిన్నాను ఆ రోజు.

జిమ్  మీదుగా ఆఫీసు కి వెళ్ళటం వల్ల ఉపయోగం లేదని, జిమ్ కి వెళ్ళాల్సిందే అని నిర్ణయించుకున్నాను. అదే రోజు బయట షాపింగ్ కి వెళ్లి ఆరు పలకల ఫోటో ఒకటి, ఎనిమిది పలకల ఫోటో ఒకటి తెచ్చి రూములో అతికించాను. ఫోటో ఎవడిది అయితేనేమి పలక ఉందా లేదా అనేది లెక్క. అప్పుడు లెక్కలు వేశాను. మన దగ్గర ఉన్న పేద్ద బండని ఆరు పలకలు చేయాలి అని. వారానికో పలక తెచ్చుకుంటే ఆరు వారాల్లో ఆరు పలకలు ఎనిమిది వారాల్లో ఎనిమిది పలకలు అని అనుకుంటుంటే ఒక సందేహం వచ్చింది. ఎవడైనా ఎనిమిదికి మించి పలకలు చేయరెందుకో అని. పది పలకలు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాలి అని నిర్ణయం తీసేసుకున్నాను.

కొత్త పిచ్చోడికి పొద్దెరగదని ఆ వేళ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. పెన్ను తీస్కుని పొట్ట మీద ఆరు పలకలు గీస్కుని చూస్కోటమే సరిపోయింది. పొట్టకి పలకలు రావాలి కండల్లో బంతులు రావాలి దానికోసం ఏమైనా చేయాలి అనుకుంటూ కూర్చున్నాను. తెల్లారింది. ముందు రోజు కొన్న ప్రోటీన్ షేక్ కలుపుకుని తాగేసి చక్కా జిమ్ కి పోయాను.

జిమ్ నాలుగో అంతస్తు లో ఉంటుంది. మెట్లతో పాటు లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది. ఈ రెండింటి ముందర ఒక చోట రాసి ఉంది - "సాధకుడివైతే మెట్లెక్కి రా సోదిగాడివైతే లిఫ్ట్ ఎక్కిరా" అని ఉంది. ఈ లోపు ఎవడో ఒకడొచ్చి లిఫ్ట్ లో పైకి వెళ్ళాడు. నేను కూడా చదివినది మర్చిపోయి(మీరు నమ్మారంటేనే) లిఫ్ట్ లో పైకి వెళ్లాను. జిమ్ కి వెళ్లాను. ట్రైనర్ కలిసాడు. దేనికి జిమ్ కి వస్తున్నారు అన్నాడు. ఆరు వేళ్ళు చూపించాను. నా ఫ్యామిలీ ప్యాక్ చూసి నోరు తెరవబోయి సభ్యత కాదని తమాయించుకున్నాడు. ఈ ఒక్కటి ఆరు కింద మారాలంటే మీరు చాలా మారాలి కష్టం మరి, చేస్తారా అన్నాడు. చస్తారా అన్నాడో చేస్తారా అన్నాడో నిర్ధారించుకుని చేస్తాను అన్నాను. ఇంకా మనం పది వేళ్ళు చూపిస్తే గుడ్లు బయటకొచ్చేలా చూసేవాడేమో పిచ్చి కూన  అనుకున్నాను.

"ముందర వంద బస్కీలు తీయండి" అన్నాడు ట్రైనర్. మూడు వేలు ఫీజు దొబ్బేసి బస్కీలు తీయమంటాడేమిటి చవకగా అనుకున్నాను. మొదటి రోజు కదా అని ఏమి అనకుండా వదిలేశాను. సరే పది నిమిషాల్లో బస్కీలు తీసి పడేస్తే పోలా.. పడుంటాడు అనుకున్నాను. పది నిమిషాల్లో ఎనిమిది బస్కీలు తీసి నేను కింద పడుకున్నాను.  అప్పుడర్ధమైంది బస్కీలు విస్కీ కన్నా వేగంగా మనిషిని పడేస్తాయని. లిఫ్ట్ ఎక్కి వస్తేనే ఇలా ఉంది మెట్లెక్కి వచ్చి ఉంటే వార్నాయనో అనుకున్నాను. ట్రైనర్ వచ్చి ఇంకా అవలేదా అన్నాడు ... నా పనో లేక బస్కీల గురించి అన్నాడో అర్ధం కాలేదు. ఇవాళ్ళ వంద తీస్తే గాని వేరేది ఏమి చెప్పేది లేదు అన్నాడు. నాకు రోషం తగ్గక సరే అన్నాను. "స్పిరిట్ అంటే అది" అనేసి వెళ్ళిపోయాడు.

"కాసేపాగి" మళ్ళీ లేచి పది నిమిషాల్లో ఆరు బస్కీలు తీసి ఏడోది తీయబోతుంటే ఏడుపొచ్చింది. మూడు వేలు గుర్తొచ్చి భాదేసింది... ఇవన్నీ శరీరం తట్టుకోలేక కిందకి లాగేసింది. అంత ఆయాసంలోను కింద పడుకునేసరికి సమ్మగా అనిపించింది. అప్పటికే జిమ్ కి వచ్చి గంట పైనే అయింది. రెండు అడుగుల దూరంలో ఉన్న నీళ్ళ సీసా ఎక్కడో ఆఫ్రికాలో ఉన్నట్టు అనిపించింది. ఎలాగోలా పాకుకుంటూ ఇంటికి వెళ్ళిపోదామని అనిపించింది. వేదం సినిమాలో అల్లు అర్జున్ లా "దీనమ్మ జీవితం" అని అరవాలనిపించింది.

కాసేపాగి(మీకు ఎంత టైం అనిపిస్తే అంత అనుకోవచ్చు) మళ్ళీ ట్రైనర్ (వెధవ :P ) వచ్చాడు. "ఎన్ని బస్కీలు తీసారు" అన్నాడు. "పధ్నాలుగు" అన్నాను లోగొంతుకతో. వాడి దిక్కుమాలిన చెవికి "నాలుగు" అని వినిపించినట్టుంది. "గంట నుండి నాలుగా తీసింది.. ఇలా అయితే మీరడిగిన ఆరు ఆరేళ్ళు అయినా రాదు" అన్నాడు. ఇలా తీసేయండి చూడండి అంటూ ఐదు నిమిషాల్లో యాభై బస్కీలు నా ముందర తీసేసి వెళ్ళిపోయాడు. నా కనుగుడ్లు బయటకొచ్చి పడిపోబోతుంటే లోపలకి పెట్టేస్కున్నాను. ఏమిటో ఎదుటివాడు తీస్తుంటే చాలా సులభం అనిపిస్తుంది! మనం తీస్తుంటే, ఆ తీసే ఒకటో రెండిటికో యమధర్మరాజు కనిపిస్తున్నట్టు ఉంటుంది. బస్కీలు తీయటం అంత "పాపం" ఇంకోటి లేదనుకుంటా!

బస్కీలు చూడటానికి బానే ఉంటాయి. చేయటానికే బాగుండవు. ఇది అర్ధమైంది  నాకు జిమ్ కి వెళ్ళిన తర్వాతనే. ఇప్పటికీ ఎవరన్నా బస్కీలు తీస్తుంటే "ఎంత గొప్పవాడో వీడు" అనుకుంటూ ఉంటా.

మరి కాసేపాగి ట్రైనర్ (దరిద్రుడు :P) మళ్ళీ వచ్చాడు. ముందే చెప్పాకదా కొత్త పిచ్చోడు పొద్దు ఎరగడని. వీడికేమో  నేను కొత్త, నన్ను ఆడేసుకుంటున్నాడు. "ఇవాళ్టికి బస్కీలు చాలు, వేరే ఏమన్నా చెప్పండి" అన్నాను. "పుషప్స్ చేయండి" అన్నాడు. "వోస్ అదెంత!?" అన్నాను. "మీలో ఉన్న ఈ స్పిరిటే మీకు పలకలు తెచ్చేస్తుంది. గుడ్!" అనేసి పోయాడు.

బోర్లా పడుకుని పైకి లేచేయటమే పుషప్స్ అంటే అనే తెల్సు మనకి. కాకపోతే చేతులతో కొంచెం పైకి పుష్ చేయాలంతే. ప్రయత్నించాను. తల, భుజాలు తప్ప ఇంకేమి లేవలేదు. మళ్ళీ వచ్చాడు ట్రైనర్ (చచ్చినోడు :P ). "మీరు పుషప్స్ చేయటం లేదు పుష్ డౌన్స్ చేస్తున్నారు" అన్నాడు నవ్వుతూ. "ఇలా చేయాలి" అని కొన్ని (ఎన్నో నేను చెప్పను) చేసి చూపించాడు. "ప్రయత్నిస్తున్నా రావటం లేదు" అన్నా. ఎవరో అబ్బాయికి చెప్పి ఏదో బెల్ట్ తెమ్మన్నాడు. కొడతాడా కొంపదీసి అనుకున్నాను. కొట్టబోతే "ఎంత పొట్టకి అంత పుషప్" అని కవర్ చేస్కోవాలి అనుకున్నాను.

ఏదో బెల్ట్ తెచ్చాడు ఆ అబ్బాయి (వెధవ :P ). వాడి ముఖం గుర్తుపెట్టుకున్నాను, ఎక్కడైనా కనపడితే బెల్టుతో బాదేద్దామని. వ్యాయామం చేసేవాడోకటి తలిస్తే చేయించేవాడు ఇంకోటి తలుస్తాడంట.  బెల్ట్ తెప్పించింది నా నడుము చుట్టూ వేసి నేను పుషప్స్  చేసేటప్పుడు పైకి లాగటానికని అర్ధమైంది. అలా ఒక పది చేసాక ఇంకా చాలు విశ్రాంతి తీస్కోమని చెప్పి వెళ్ళాడు ట్రైనర్ (దేవుడు :P ). నాకేమో ఎవరికీ కనపడకుండా పాక్కుంటూ పారిపోదామనిపించింది. అది కూడా అయ్యేలా లేదని తెల్సి, ఎవడన్నా వెళ్తుంటే వాడి కాలు పట్టుకుని  ఇంటి దాకా లాక్కెళ్ళరా పుణ్యముంటుంది అని అడుక్కోవాలనిపించింది.

మళ్ళీ వచ్చాడు ట్రైనర్ (పిచ్చోడు  :P). "ఇవాళ్టికి చాల్లెండి. మీ ఫిట్నెస్ చూద్దామని, మీకు కూడా చూపిద్దామని ఇవన్నీ చేయమన్నాను. పలకల కోసం మీరు చాలా దూరం ప్రయాణించాలి. సో గెట్ రెడీ. ఆఫీసు కి వెళ్లి ప్రోగ్రామ్స్ రాసుకుంటూ రేపటికి రెడీ అవ్వండి" అన్నాడు. నేను మనసులో అనుకున్నాను - "ఇంత జావ కారిపోయాక జావాలో ప్రోగ్రామ్స్ ఇంకేమి రాస్తాం" అని. ముకుళిత హస్తాలు జోడించి ట్రైనర్(మహానుభావుడికి :P)కి నమస్కారం చేసి, అక్కడే ఇంకో గంట(నుకుంటా) కూర్చుని, పేపర్ చదివి(నట్టు నటించి), ఇంటికి వచ్చాను. ఆ వేళ సెలవు పెట్టి పడుకున్నాను. మళ్ళీ పక్కరోజు పొద్దున్న ఆఫీసుకి పోయాను.

మళ్ళీ కొలీగ్ (దొంగమొహంది :P) కనపడింది. "ఏంటి లావుగా నీరసంగా ఉన్నావు కాంతారావ్?" అన్నది. "నీ పని నువ్వు చూస్కో. లేకపోతే సెక్సువల్ హరాస్మెంట్ కింద కంప్లైంట్ చేస్తా! ఆ !!" అనేసి పోయాను. డంగై పోయి చూసింది దొంగది. కొంతమంది అంతే మరీ చొరవ తీస్కుంటారు, వాళ్ళతో అలానే ఉండాలి(:P). ఉంటా!!







Monday, June 9, 2014

సొంతంగా ఆలోచించే కాలిక్యు"లేటరు"

నేను బీటెక్ చదివే రోజుల్లో నా దగ్గర ఒక కాలిక్యులేటరు ఉండేది. కంపెనీ పేరు గుర్తులేదు కానీ అది చేసిన చిత్రాలు గుర్తున్నాయి.


దానిని నాన్న నేను బీటెక్ లో చేరేటప్పుడు ఇస్తూ ముత్తాతల నుండి వస్తున్న ఆచారం ప్రకారం ఇది నీకు ఇస్తున్నాను అన్నాడు. ఇచినప్పుడు బానే ఉంది కాకపోతే అదే రోజు బ్యాగ్ లో పెట్టుకోబుతుంటే కింద పడింది. దానిలో ఉండే పార్ట్లు అన్నీ కదిలేలా పడింది రెండు ముక్కలైంది. నేనేమో రెండు అతుకులు వేసి సరి చేశాను.

అసలు కథ తర్వాత రోజు క్లాసు లో మొదలైంది!

ఇంగ్లీష్ క్లాసు బోర్ కొట్టి మా ఫ్రెండు ముందు  బిల్డప్పు ఇద్దామని బ్యాగులో నుండి కాలిక్యులేటరు తీసి  బల్ల మీద పెట్టాను. వాడేమో కొత్త కాలిక్యులేటరు తీసి బయట పెట్టాడు. హఠాత్తుగా ఇంగ్లీష్ క్లాసు ఆసక్తి కరంగా మారిపోయింది.

కాసేపాగి 9x2 ఎంతో చూద్దామని సరదా పడి కాలిక్యులేటరు లో మీటలు నొక్కాను. "92" అని చూపించింది. కింద పడ్డాక 'x' మీట పని చేయటం లేదేమో అని మళ్ళీ అదే లెక్క చేసాను ఈ సారి 'x' మీట కొంచెం గట్టిగా నొక్కాను. ఈ సారి "18" అని చూపించింది. కర్రెక్టా కాదా అని ఫ్రెండు కాలిక్యులేటరు లో చేసి చూసాను. అంతే చూపించింది. హమ్మయ్య నా కాలిక్యులేటరు పని చేస్తోంది అనుకున్నాను.

తర్వాత ఇంజనీరింగ్ మెకానిక్స్ క్లాసు. మా ప్రిన్సిపాలే చెప్పేది కూడా. ఆ సబ్జెక్టు లో భయంకరమైన లెక్కలు ఉంటాయి. మొదట ఏదో చిన్న ప్రాబ్లం ఇచ్చాడు ... అంతా చేస్తే "43x2" చూడాల్సి వచ్చింది. చక చకా కాలిక్యులేటరు లో చేసి చూసి "36" అని రాసేసాను.

మా ప్రిన్సిపాల్ కి ప్రాబ్లం ఇచ్చి క్లాసు లో రౌండ్స్ వేయడం అలవాటు ఎలా చేస్తున్నారో చూద్దామని. నా దగ్గరికి వచ్చాడు. నేను పుస్తకం ముందరకి జరిపి కాల్గేట్ నవ్వు నవ్వాను. ఆయన సీరియస్ గా నా వైపు చూసాడు. నాకు డౌట్ వచ్చి పుస్తకం వైపు చూసాను.  "నీకు చేయటం రాకపోతే కాలిక్యులేటరు వాడొచ్చు గదా. ఎందుకు ఇలాంటి పనులు చేస్తావు" అనేసి వెళ్ళిపోయాడు.

నేను వెంటనే మా ఫ్రెండు కాలిక్యులేటరు లాక్కుని లెక్క చేసి చూసాను. "86" అని వచ్చింది.

"ఏరా పని చేయటం లేదా కాలిక్యులేటరు?" అన్నాడు ఫ్రెండు.
"కాదు... ఎలా పని చేయించాలో తెలీటం లేదు" అన్నాను.

నా కాలిక్యులేటరు తీస్కుని "43x2" మూడు సార్లు చేసాను. 73, 86, 86 అని చూపించింది. "ఓహో.. బెస్ట్ అఫ్ త్రీ" అన్నమాట అని నిర్ణయించుకున్నాను.

"ఇంకో సారి చేసి చూడరా... ఇంకేమి చిత్రాలు చూపిస్తుందో" అన్నాడు ఫ్రెండు.

మళ్ళీ చేసాను. ఈ సారి 56, 74, 86 చూపించింది. మా వాడు రూపాయి నాణెం ఇచ్చాడు. టాస్ వేసి ఆ మూడిటిలో ఏదో తేల్చుకోమని!!! తేలిస్తే 86 వచ్చింది. హమ్మయ్య అనుకున్నాను. ఇంకోసారి అనబోయాడు మావాడు. నేను నోరు నొక్కేసాను వాడిది.

ఇక అప్పటి నుండి అదే రకంగా లెక్కలు చేసేవాడిని. చేసాక మా ఫ్రెండ్ పుస్తకం లో చూసి కర్రెక్టా కాదా అని చూసుకునేవాడిని. చాలాసార్లు అంటే పదికి మూడు నాలుగు సార్లు కరెక్ట్ అయ్యేది.  ఒక్కోసారి వాడే లెక్క తప్పు చేసేవాడు. అప్పుడు ఎవడిది కరెక్ట్ అనేది అర్ధమయ్యేది కాదు. థర్డ్ అంపైర్ కి విన్నవించేవాళ్ళం.

ఒకసారి మా ప్రిన్సిపాల్ క్లాసు లో రౌండ్స్ వేస్తూ లెక్క చూద్దామని నా దగ్గరికి వచ్చాడు. కొంచెం పెద్ద లెక్క కావటంతో నా కాలిక్యులేటరు తీస్కుని చేసి చూసాడు. ఏదో చూపించింది. మళ్ళీ చేసి చూసాడు. మళ్ళీ వేరే. ఒకే టికెట్ మీద రెండు చెత్త  సినిమాలు చూసినట్టు మొహం పెట్టాడు. నన్ను దానిని చికాకు గా చూసి వెళ్ళిపోయాడు. 

మా క్లాసు లో సుగుణసుందరి అనే అందమైన అమ్మాయి ఉండేది. నేనేమో ఆ అమ్మాయికి తెలీకుండా బీటు వేసేవాడిని. అలా బీటు వేసినప్పుడల్లా నా గుండె బీటు తప్పేది. అమ్మాయి అప్పుడప్పుడు చూసి నవ్వేది. మా ఫ్రెండు కూడా నవ్వేవాడు నా కన్నా ముందే. అప్పుడప్పుడు నేను ఆ అమ్మాయి, సంక్రాంతి ముగ్గులని, ముగ్గుల పోటీల గురించి వాటి ప్రిపరేషన్ గురించి మాట్లాడుకునేవాళ్ళం. మా అక్క వేసిన ముగ్గు చూపించి నేనే కనిపెట్టా అని గొప్పలు చెప్పేవాడిని కూడా.

ఒక రోజు ఆ అమ్మాయి కాలేజీకి రాలేదు.
నేను ఫ్రెండుతో "ఏరా.. సుసు రాలేదా?" అన్నాను.
"ఇందాకేరా పోయివచ్చాను... అయినా నా సుసు గురించి నీకెందుకు?" అన్నాడు.
"సుసు అంటే సుగుణసుందరిరా సోదిగాడా" అన్నాను.
"ఓహో ఆ సుసునా ఇవాళ రాలేదు... కొంపదీసి పెళ్ళిచూపులు ఏమో" అన్నాడు.
నాకు గుండె జారి ప్యాంటు లోకి వచ్చేసింది. 
"శుభం పలకరా మగడా అంటే శుభం కార్డు వేస్తావేమిటి రా" అని కసురుకున్నాను. 

ఆ రోజు సాయంత్రమే సుసు ఇంటికి సైకిల్ మీద వెళ్లాను, జేబులో కాలిక్యులేటరు పెట్టుకుని. లెక్కలు తేల్చుకుందామని!

వాళ్ళ అమ్మగారు(కాబోయే అత్తగారు) తలుపు తీసి కూర్చోమన్నారు.  అమ్మాయి లోపల ఉంది వస్తుంది అన్నారు.
"మంచి నీళ్ళు కావాలా" అనడిగారు.
"మర్యాదలేవి వద్దండి" అన్నాను.
వింతగా చూసి వెంటనే లోపలికి వెళ్ళిపోయారు.
అక్కడే సుసు తమ్ముడనుకుంటా కూర్చుని హోంవర్క్ చేస్కుంటున్నాడు.
"అంకుల్! మీకు లెక్కలొచ్చా?" అన్నాడు తలెత్తి.
నాకు పీకలదాకా కోపమొచ్చింది, లెక్కలొచ్చా అనడిగినందుకు. జేబు తడుముకున్నాను, చల్లగా కాలిక్యులేటరు తగిలింది. ఇంకో జేబు తడుముకున్నాను రూపాయి నాణెం తగిలింది.

అన్నీ అస్త్రాలున్న అర్జునుడిలా ఆడిని ఆగ్రహంగా (అ గుణింతం) చూసాను.
అయినా తమాయించుకుని "నేను నీకు అంకుల్ లా కనిపిస్తున్నానా?" అనడిగాను.
"ఈ లెక్క చెప్పండి. చెప్తే అంకుల్ అని పిలవను" అని వరం ఇచ్చాడు.
"ఏ లెక్క?"
"19x19 ఎంత?"
 వినగానే నా మెదడు చేతులెత్తేసింది. నా చెయ్యేమో జేబులోకి పోయింది. కాలిక్యులేటరు బయటికి తీసాను. మూడు నిమిషాలాగి రూపాయి నాణెం తీసాను. అయిదు నిమిషాలకి 281 అని చెప్పాను.
చెప్పేసరికి వాడు అప్పటికే పేపర్ మీద చేసేసి రెండో లెక్కతో రెడీ గా ఉన్నాడు.
"అంకుల్, మీ కంటే మీ కాలిక్యులేటరు కంటే నా పెన్సిల్ ఫాస్టు" అన్నాడు.
ఇంకో లెక్క చేస్తారా అన్నాడు.
ఆవేశం తో ఊగిపోతూ " ఈ సారి ఆల్  టైం రికార్డు సృష్టిస్తా" అన్నాను.

"19x21 ఎంత?" అన్నాడు.
ఈ సారి నాణెం వాడకుండా కాలిక్యులేటరు మాత్రమే వాడాలని డిసైడ్ అయ్యాను (కోపమొస్తే మెదడు పని చేయదు, ఒళ్ళు తెలీదు  కదా).  కావలసిన మీటలు నొక్కి టఖీమని చెప్పాను కాదు అరిచాను "37" అని.
వాడు అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడేటప్పుడు వై.యెస్ నవ్వినట్టు నవ్వాడు.
నాకు తల కొట్టేసినట్టు, కాళ్ళు పట్టేసినట్టు, చెమటలు కూడా పట్టేసినట్టు అయింది. బయటకెళ్ళి గొయ్యి తీసి కాలిక్యులేటరు ని పూడ్చి పెట్టేద్దామనిపించింది. ఆ రూపాయి తో సోడా కొనుక్కుని తాగాలనిపించింది.
వెంటనే లేచి "మళ్ళీ వస్తాను " అని బయటకి వచ్చేసాను. బయటకి వచ్చి వెనక్కు చూస్తే వాడు  వై.యెస్ లా మళ్ళీ నవ్వాడు. నా సైకిల్ ని 50 kmph స్పీడ్ లో తోసుకుంటూ ఇంటికి వచ్చేసాను.

మనకి ఒకటి అనిపిస్తే దేవుడికి ఇంకోటి అనిపిస్తుందంట. సినిమాల్లో చెప్తుంటారు కదా.  ఇంటికెళ్ళి నాన్నతో నాకు ఈ దిక్కుమాలిన కాలిక్యులేటరు వద్దు. ఇవాళ్ళ చిన్న పిల్లాడి ముందర పరువు పొయింది అన్నాను. దానికి నాన్నేమో "ఈ రోజుల్లో  చిన్న పిల్లలు బాగా తెలివిగలవాళ్ళురా, వాళ్ళతో పెట్టుకుంటే అంతే" అన్నారు. "కాలిక్యులేటరు  ఇచ్చింది నువ్వు లెక్కలు చేస్కోటానికి గాని  వేరే వాళ్లకి లెక్కలు చెప్పటానికి కాదు" అని కూడా అన్నారు . 

ఇలా కాదని కాలిక్యులేటరు తీసి "12x9" లెక్క చేసి మా నాన్నకి చూపించాను. "108" అని చూపించింది. దొరికింది దొంగమొహంది అని నాన్నకి చూపించాను. నాన్న అది చూసి "బానే పని చేస్తోంది కదా, నువ్వు నాకు చూపించావంటే నీకు ఎంతో తెల్సి ఉండదు. ఇప్పుడర్ధమైంది పరువు ఎలా పోయిందో" అన్నారు. (పైన BOLD లో రాసిన వాక్యాలు మళ్ళీ చదువుకోగలరు)

నాకు వచ్చిన లెక్కలు టెస్ట్ చేద్దామని, ఈ సారి "4x4" ఎంతో చూసాను. "16" అని చూపించింది. (పైన BOLD లో రాసిన వాక్యాలు మళ్ళీ  మళ్ళీ చదువుకోగలరు). ఏడుపు కూడా వచ్చింది. ఛీ ఛీ వెధవ బతుకు అనుకున్నాను. 
నా ఏడుపు పట్టించుకోకుండా నాన్న వెళ్ళిపోయారు. 

ఇంతా చేశాక ఇపుడు దానిని పూడ్చిపెట్టేసి, పోయింది  అంటే ఎవరు నమ్ముతారు. ఏమైనా చేసి కొత్త కాలిక్యులేటరు కొనాలి కొని తీరాలి అనుకుని ఆ విలన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయాను. తర్వాతి రోజు కాలేజీ కి కూడా తీసుకు వెళ్ళలేదు. 

కానీ ఆ రోజు ఇంటికి వెళ్లేసరికి కొత్త కాలిక్యులేటరు నిగనిగ లాడుతూ కనిపించింది. నా కోసమే కొన్నారట. ఆ వేళ పొద్దున నాన్న పాల వాడి లెక్క చూస్తే కాలిక్యులేటరు మూడు లక్షలు చూపించిందట!! అందుకే అది కాలిక్యు"లేటరు" అయింది ఎప్పుడు సమాధానం అడిగినా లేటర్ తెలిసేది కాబట్టి.

Saturday, May 17, 2014

పకోడీలు - 4


జనాలు,
ఫ్యాన్ దుమ్ము దులిపారు
సైకిల్ ఎక్కి ఆ విధంగా ముందుకు పోదామన్నారు
జై"సఫా" అయ్యింది
కార్ దూసుకెళ్లింది
చెయ్యి పప్పులో కాలేసింది... ఇక్కడా ... అక్కడాను!
నమో నమో (అనుకుంటూ) వెంకటేష్ తో పవన్ ని "ఓర్నా దేవుడో" చేస్కోమన్నారు!


నాకు నాన్న లేడు
         నాకు కూడా లేడు
మా అమ్మ నన్ను లాక్కొచ్చింది
         నేను మా అమ్మను లాక్కొచ్చాను
నాకో చెల్లి ఉంది ... బావ కూడా
         నాకు కూడా చెల్లి ఉంది ... బావ కూడా
మా బావ సామాన్యుడు కాదు
         మా బావ నా కంటే సామాన్యుడు కాదు
అందరం ఏలేద్దామని మా ప్లాన్
         హేయ్! మాది కూడా సేమ్ ప్లాన్
నాకు జైలు ఎలా ఉంటుందో తెలీదు
         నేనే బెటర్! పదిహేను నెలలు "పరిశీలించి" వచ్చాను!
నా మీద కేసులు ఏమి లేవు
         నా దగ్గర సూటుకేసులు, కేసులు బోల్డున్నాయి
నాకు కారు కూడా లేదు
         నాకు కూడా  లేదు కానీ కావాలంటే కుయ్యి కుయ్యి అంటూ అంబులన్స్ వస్తుంది!
మాకు మోహన్ అని మంచి పనోడు ఉన్నాడు
         "అన్నీ పనులు" నాకు నేను చేసుకోగలను
నేను పువ్వు తగిలి పడ్డాను
         నేను సైకిల్ కింద పడ్డాను
నా పేరు ముద్ద పప్పు
         నా పేరు పెద్ద ముప్పు!!


























Tuesday, April 29, 2014

2054లో

2054 లో ఇవి ఇలా ఉండొచ్చు... వీళ్ళు అలా ఉండొచ్చు అని చిలిపి ఊహ!

ఆహారం:
ఇడ్లీ  పిల్స్... భోజనం ఇంజెక్షన్స్... విందు పేరెత్తకుండా వాక్సిన్!

మొబైల్ ఫోన్:
స్క్రీన్ సైజు పెరిగి పోయి ఒక్కో ఫోన్ చేట అంత ఉంటుందేమో... దాని మీద రుద్దుకోటానికి రోకలి అంత స్టైలస్ ఉంటుందేమో... ఇవన్నీ మోయటానికి రోబోలు కొనుక్కుంటామేమో!

నీళ్ళు:
మ్యూజియంలో ఉంటాయేమో!

ముద్దు:
కాలుష్యం ఎక్కువైపోతే అందరు మాస్కులు వేస్కుని తిరుగుతుంటే ఇంకా ముద్దేంటి నా బొంద!

జీతం:
ఇప్పుడే హైక్ అని చెప్పి వేరుశనగలు ఇస్తున్నారు... అప్పుడు ఆవాలు ఇస్తారేమో?!

మొక్కలు... చెట్లు:
అంటే?

సర్జరీ:
ఆఫీసుకి వెళుతూ దారిలో ఆగి చేయించుకుంటామేమో!

పెళ్ళిళ్ళు:
అమ్మాయి దొరికితే ఎదురుకట్నం ఇవ్వాలేమో... దొరక్కపోతే ఇంకో అబ్బాయినే చేస్కోవాలేమో!!

తెలుగు:
వాట్ ద....  ఈజ్ టెల్గు బ్రో?!

అమెరికా:
అందరి మీద దాడి చేసి చేసి విసిగొచ్చి, గ్రహాల మీద పడతారేమో.

రాజమౌళి:
బాహుబలి తర్వాత ఇంకో రెండు సినిమాలు తీస్తాడేమో!

నేను:
అప్పటికి కూడా పని పాట లేకుండా ఇలా రాస్కుంటూనే ఉంటానేమో!





Wednesday, April 23, 2014

పప్పుగాడు

పప్పుగాడి పూర్తి పేరేమిటి?
ముద్ద పప్పు

పప్పుగాడి చమక్కులు కొన్ని చెప్పండి?
ఇవాళ్ళ పొద్దున నేను అర్ధరాత్రి నిద్ర లేచాను!!
మీ మీద జరిగే దురాచారాలని(అత్యాచారాలు అనబోయి) ఆపండి!!

పప్పు మీటింగ్ కు జనాలు ఎందుకు వస్తారు?
వీలైతే నాలుగు నవ్వులు... కుదిరితే కొన్ని వాక్య దోషాలు సరిచేయటానికి

పప్పు గాడికి వచ్చిన మాటల్లో  ఎక్కువ వినపడేవి ఏమిటి?
ఎఫ్.డి.ఐ, ఆర్.టి.ఐ, విమెన్ ఎమ్పవర్మెంట్

"లవ్లీ" పాటను పప్పు ఎలా పాడతాడు?
ఓ పిల్లా నీ పేరు లవ్లీ నిన్ను కాస్త ఎంపవర్ చేయాలి
నీ బాబు చేసే పనేంటో దాని మీద ఆర్టిఐ వేయాలి

పప్పుగాడు చెయ్యెత్తి పిలిస్తే ఏమవుతుంది?
దేశం సగం చంక నాకిపోతుంది.

పప్పుకి, ఇపుడున్న మోహన్ కి తేడా ఏమిటి?
మోహన్ ఎప్పుడు మాట్లాడతాడో అని ఎదురుచూస్తాం .... పప్పు ఎప్పుడు ఆపుతాడో అని

బాలయ్యకి పప్పుకి తేడా ఏమిటి?
బాలయ్య తొడ కొట్టగలడు... తుపాకి పేల్చగలడు... బులెట్ ని మనిషి శరీరంలోనే ఉంచేసి బతికించేయగలడు ... మిగతాదంతా సేమ్ టు సేమ్!

పప్పు పెద్ద ముదురా?
వయసులోనే  తప్ప మెదడులో కాదు

పంచ్ డైలాగులో పప్పుకి బుడ్డోడికి తేడా ఏంటి?
పప్పు ఏమో నేను మా కుటుంబం అంటాడు... బుడ్దోడు ఏమో నేను మా తాత  అంటాడు

డెవలప్మెంట్ ఇంగ్లీష్ లో స్పెల్లింగ్ అడిగితే పప్పు ఏమి చేస్తాడు?
వాళ్ళ అమ్మ వైపు చూస్తాడు... ఆవిడ కాంగ్రెస్ శ్రేణుల వైపు చూస్తుంది... వాళ్ళంతా ప్రియాంక వైపు చూస్తారు... ప్రియాంక వాళ్ళ ఆయనేమో అదేమిటో ప్రాక్టికల్ గా చూపిస్తాడు!!

పప్పుకి వాద్రాకి తేడా ఏమిటి?
పప్పు పని చేయకుండా మాట్లాడుతుంటాడు... వాద్రా మాట్లాడకుండా "పని" కానిచ్చేస్తుంటాడు!

Wednesday, April 16, 2014

పకోడీలు - 3

మాన భంగం పెద్ద నేరమేమి కాదంటాడు ములాయం
ఆయన మీద జరిగితే కాని అర్ధంకాదేమో విషయం
అసలే అతివకు ప్రతిరోజు భయం భయం
ఇలాంటోళ్ళ వల్ల  అది నిజమవటం ఖాయం!


సమయం చూసి కొట్టాడు సంజయ్ బారు
కాంగ్రెస్ అంటోంది ఆ పుస్తకమే చవకబారు
సమయాన్ని ప్రశ్నించవచ్చు గాక
కాదనలేం అది పుట్టించిన కాక
మోహనుడిని డమ్మీ చేసిన రాజమాత
చేసినవన్నీ ప్రధానివే అని పైపూత
అలా సహకరించనందుకేనేమో పి వి నరసింహారావు
ఆయన విజయాలు ఏ కొద్దిమందికో తప్ప తెలియవు!


హిందూపురంలో బాలయ్య నామినేషన్
అక్కడ మొదలైందేమో ఇక టెన్షన్
ఏ టైములో ఎక్కడ ఏమి మాట్లాడతాడో
ఎవరింటి ముందర ఎందుకు తొడ కొడతాడో!



Saturday, April 12, 2014

పకోడీలు - 2

బాలయ్యకి దొరికింది హిందూపురం
హరికృష్ణకి మాత్రం టికెట్టు ఇంకా దూరం
కృష్ణయ్యకీ దొరికింది టికెట్టు
హరికృష్ణకి తప్పలేదు ఇక్కట్టు
రమ్మంటే వస్తానని బుడ్డోడు
చంద్రబాబుకి వాడు చెడ్డోడు
ఎవరికీ కానివారీ తండ్రీకొడుకులు
ఏమి చేసినా ఉడకటం లేదు వీళ్ళ పప్పులు!!

ఎవరూ దొరక్కపోతేనే అభిమానులు గుర్తొస్తారు
అప్పుడు మాత్రం పిలిచి మరీ టికెట్టు ఇస్తారు!
పడుతుందో లేదోగాని వోటు
పరువు కోసం నిలబెట్టాలి కాండిడేటు
తెగ కష్టపడిపోతున్నాడు పద్మభూషణుడు
మళ్ళీ అవుతాడా విషణ్ణ వదనుడు!
నల్లారి వల్లే మనకీ దుర్గతని చిరంజీవి
చల్లారినవి పట్టించుకోవటం లేదు ఏ జీవి!


Thursday, April 10, 2014

పకోడీలు - 1

ఎవడికి (అధికార) దాహమేస్తే ఎవడిని పడితే వాడిని పార్టీలో చేర్చుకుంటాడో ఆడే చంద్రబాబు!!

పెళ్లి చేస్కోలేదు అంటే కొంతమంది అబద్ధమని తిట్టారు! 
అవును చేస్కున్నాను అంటే ఇంతకుముందు తిట్టని వాళ్ళు కూడా తిడుతున్నారు!!
మరదే కా"మోడి" అంటే!!! 

జర్రున ముందుకు వచ్చావు... బర్రున వెనక్కు పోయావు 
మోడీ మోడీ అన్నావు... భాజపం చేశావు 
పెళ్లై కూడా చెప్పనందుకు ప్రశ్నించవేమిరా 
ఎక్కడున్నావు నాయనా పవన కళ్యాణా!!

ఒకటేమో చెయ్యి (ఇచ్చే) పార్టీ 
ఇంకోటేమో పువ్వు (పెట్టే)పార్టీ 
మరోటేమో దెబ్బలు తినే పార్టీ 
యెవడొచ్చినా తప్పదు మనకి కష్టాల దోస్తీ!

Saturday, April 5, 2014

వచ్చేవారే! పోయేవారే!!

ఎన్టివోడు వచ్చినాడు... "లపా" "లపా" అన్నాడు
"అల్లుడుగారు" సినిమా చూసి పైకి టపా కట్టాడు!

చంద్రబాబు వచ్చినాడు... స్వర్ణాంధ్ర అన్నాడు 
ఆ వెలుగులు చూడలేక వరుణుడు కళ్ళు మూశాడు! 

రాజశేఖరుడొచ్చినాడు... జలయజ్ఞం అన్నాడు 
"జగన్నా"టకాలాడి... జనాల్ని జలగల్లె పీల్చాడు!

చిరంజీవి వచ్చినాడు... జనం రమ్మన్నారన్నాడు(?)
రాజ్యం తెస్తానన్నోడు... సామంత రాజై (రాజ్యసభకి) పోయాడు!

నల్లారి వచ్చినాడు... సమైక్యాంధ్ర అంటాడు
చేతులు కాలిపోయాక బూతులు తిడదామంటాడు!

పవన్ బాబు వచ్చినాడు... ప్రశ్నిస్తా(అన్నను తప్ప) అన్నాడు 
అదే ఆవేశంతో తనను తాను "మోడి"ఫై చేస్కున్నాడు!







Monday, March 31, 2014

ఉగాది పచ్చడి

చిరంజీవి ఇంట్లో చేదుగా ఉండొచ్చు.
మొహం అదోలా పెట్టి కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిది అనొచ్చు.
ఏమిటి సంబంధం అని మీరు అడగొచ్చు.
ఆయనకి  అంతే వచ్చు.

పవన్ కళ్యాణ్ ఇంట్లో కారంగా ఉండొచ్చు.
ఏమిటి ఇలా ఉందని "ప్రశ్నించొచ్చు".
ఇంకా "మోడి"ఫై చేయమనోచ్చు.

బాలయ్య ఇంట్లో తియ్యగా ఉండొచ్చు.
చేదు బాగా అలవాటవటం వల్ల అయ్యుండొచ్చు.
ఏమి అడిగితే ఏమి చెప్తాడో అని మీరు ఏమి అడగకపోవచ్చు.

రాజమౌళి ఇంట్లో ఇప్పట్లో తయారవకపోవచ్చు.
ఎప్పుడు చేసిన బానే ఉంటుంది కనుక మనం ఓపికగా ఎదురు చూడొచ్చు.

చంద్రబాబు ఇంట్లో ఒక్కోసారి ఒక్కో రుచి ఉండొచ్చు. ఎలక్షన్ సర్వేల లాగా.
ఏది ఎలా ఉన్నా రెండు వేళ్లు చూపించటం ఆయన మానకపోవచ్చు.
ఈ సారి కూడా గెలవకపోతే ఆ రెండు వేళ్ళతో "రెండు కళ్ళు" పొడుచుకోవచ్చు.

జగన్ ఇంట్లో చేయకపోవచ్చు.
ఒకవేళ చేస్తే ఆయనకి ఎలా ఉన్నా తినటమే తెలుసు.
అడిగితే నేను తిన్న వాటితో పోలిస్తే ఇదొక లెక్కా అనొచ్చు.

కెసిఆర్ ఇంట్లో తియ్యగా ఉండొచ్చు. లేకపోతే కుట్ర అనొచ్చు.
కొంచెం పెట్టమని కాంగ్రెస్ అడిగితే ఉత్త వేప"పువ్వు పెట్టొచ్చు".

కిషన్ రెడ్డి ఇంట్లో ఎప్పుడూ చేస్కోరు.
ఎప్పుడూ ఎవరో ఒకళ్ళు వచ్చి పెట్టడమే.
ఈసారి ఏమైందో నేనే చేస్కుంటా అనొచ్చు, చెయ్యి కాల్చుకోవచ్చు!



Saturday, March 29, 2014

ఏ బాబు?!

[శ్రీరామదాసు సినిమాలో "ఏ మూర్తి" పాట ప్రేరణతో]

ఏ బాబు మాట్లాడుముందు శ్లోకాలు చదువునో 
ఏ బాబు మాట్లాడితే మనకు అర్ధం కాదో 
ఏ బాబు హీరోయిజంలో విజయకాంత్ కి పోటీనో 
ఏ బాబు హీరో అంటే హీరోయిన్లు దొరకరో 
ఆ బాబు బాలయ్య బాబు!!

ఏ బాబు సీరియస్ సినిమా చేస్తే మనకి కామెడీ సినిమాయో 
ఏ బాబు కామెడీ సినిమా చేస్తే మనకి ట్రాజెడీ సినిమాయో 
ఏ బాబు చేసే స్టంట్లు సైన్సుకి అర్ధం కావో
ఏ బాబు చేసిన డాన్సులు సెన్స్ చంపేస్తాయో
ఆ బాబు బాలయ్య బాబు!!

ఏ బాబు పేరు చెపితే బెల్లంకొండ వణుకునో
ఏ బాబు అక్క ఇంటి ముందు తొడ కొట్టునో
ఏ బాబు చంద్రబాబు చేతిలో కీలుబోమ్మో
ఏ బాబు CM అయితే జనాలంతా వామ్మో
ఆ బాబు బాలయ్య బాబు!!

Thursday, March 27, 2014

ఎవడిని నమ్మాలి??

సమన్యాయం అంటాడు గాని ఎలాగో చెప్పలేదు ఒకడు 
చెప్పినోడి మాట వినలేదు ఎవడూ !!

రాజ్యమంటూ వచ్చాడొకడు... రాజు కాలేక చేత్తో గోక్కుంటున్నాడు
సైన్యమని ఇపుడు ఇంకొకడు... ఆపుకోలేక ఆవేశపడుతున్నాడు !!

ఎవడిని నమ్మాలి... ఎవడి మీద ఉమ్మాలి?!

రాజమాత వేట!!

రాజమాత కి మూడొచ్చింది.. వేటకి వెళ్ళింది
ఒక్క దెబ్బకి రెండు పిట్టలు కొట్టాననుకుంది.. 
ఒక పిట్టేమో తినటానికి పనికి రాలేదు 
ఇంకో పిట్టేమో గద్ద (ముక్కు) పట్టుకుపోయింది!!

Sunday, March 16, 2014

పవరు..ఎంపవరు!!

ఆ మధ్య పప్పూని అర్నబ్ గోస్వామి ఇంటర్వ్యూ చేసిన (అనే కంటే రేప్ చేసిన అనొచ్చేమో) వీడియో youtube లో చూశా...

పప్పుతో సూటిగా సుత్తి లేకుండా జరిపిన చిన్న మాటామంతి ...

నేను: హాయ్ పప్పూ!
పప్పు: హాయ్ కత్తి!

నేను: ఏంటి ఇంకా పెళ్లి చేస్కోవా? రాజకీయాల ప్రకారం కుర్రోడివే గానీ, వయసు ప్రకారం ముదురువి నువ్వు ఇప్పుడు!
పప్పు: నేను పెళ్లి చేస్కుంటాను మొర్రో అంటుంటే అమ్మ నన్ను ముందర ఈ జనాల పెళ్లి చేయరా అంటుంది బాసూ! అమ్మ మాట పప్పు ముద్ద అని నేను నమ్ముతాను. అందుకే ముందర మీ పెళ్లి చేసి తర్వాత నేను చేస్కుంటా.

నేను: అది మాకు తెల్సులే గాని... నీకు పప్పు అనే పేరు ఎలా వచ్చింది బ్రో!?
పప్పు: నీలాంటి తమావె ఎవడో పెట్టాడ్లె బాసూ!

నేను: తమావె అంటే?
పప్పు: తల మాసిన వెధవ అని!!

(వార్నీయమ్మ కడుపు ఇటలీ వెళ్ళినప్పుడు మాడ)

నేను: నువ్వు సాధించిన విజయాల మీద ఒక వెబ్ సైట్ ఉంది తెల్సా?
పప్పు: ఏంటో అది?
నేను: పప్పు గాడి గొప్పలు డాట్ కామ్ అని...ఒకసారి చూడు!
పప్పు: వార్నీనోట్లో ఇటాలియన్ పిజ్జా పెట్ట... నాకు అంత ఫాన్స్ కుడా ఉన్నారా?
నేను: ముందు చూడు... తర్వాత మాట్లాడు
పప్పు: (నా ప్రాస ప్రయాస చూసి) ఏంటిది.. కొత్త తెలుగు సినిమా పాటా?
నేను: యెహె... వెబ్ సైట్  చూడు అంటున్నాను

(మొబైల్ లో 3G ఆన్ చేసి వెబ్సైటు బ్రౌస్ చేసాడు)
పప్పు: ఏంది బ్రో! 3G పెట్టినా సైట్ లోడ్ అవటం లేదు..
నేను: ఏమన్నా లోడ్ ఉంటె లోడ్ అవుతుంది... ఏమి లేకపోతే ఎందుకు అవుతుంది?
పప్పు:  అంటే? (డౌట్ గా చూసాడు)
నేను: అదే... నువ్వనుకునేదే.. సరిగ్గా అదే...
పప్పు: ఏంటిది.. ఇంకో కొత్త తెలుగు సినిమా పాటా?

(నా తలకాయ రా... నా తలకాయ అనుకున్నా!!)

నేను: సర్లే గానీ... 3G లో మూడు Gలు ఏంటో చెప్పు?
పప్పు: మూడు Gలు ఎక్కడ ఉన్నాయి? ఒకటేగా ఉంది!!
నేను: కాదు... సోనియాజి, పప్పూజి ... జి ని కలిపి 3G అంటారు
పప్పు: మూడో G ఏంటి... ఉత్త G నా?
నేను: కాదు... <మన్మోహన్> జీ  ... కాకపోతే <మన్మోహన్> సైలెంట్ అన్నమాట!

అర్ధం కానట్టు మొహం పెట్టాడు... నాకు అర్ధమై టాపిక్ మార్చే(లోపల అటుగా ఒక అమ్మాయి వచ్చింది. నేనేమో పళ్ళు యికిలించాను. మనోడేమో లేచి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి ఎంపవర్ చేస్తా అన్నాడు. "అంటే ఏంటి?" అని అడిగింది.. వెంటనే వెనక్కి తిరిగి వచ్చేసి కూర్చున్నాడు. ఆ అమ్మాయి మా వైపే చూసింది... పప్పు నా వైపు చూసాడు... నేను ఆ అమ్మాయి వైపు చూసి మళ్ళీ పళ్ళు యికిలించాను. అదే ఎంపవర్మెంట్ ఏమో అనుకుని అమ్మాయి చిరాగ్గా చూసింది..)శాను!

మనోడికి ఏదన్నా స్క్రిప్ట్ ఇస్తే..."ఉండమ్మా ఎంపవర్ చేస్తా!" అని పేరు పెట్టి సినిమా తీస్తాడు.

నేను: ఈ ఎంపవర్ గోలేంది బ్రో?
పప్పు:  సమసమాజ స్థాపన కోసం.. అణగారిన వర్గాలలో ఉన్న ఆడవారికోసం... ఇంకా...

తర్వాత ఏమి గుర్తు రాలేదనుకుంటా... జేబులోనుండి పేపర్ తీసాడు... నాకు అర్ధమై(భయమేసి) వద్దని వారించాను.

నాకు అర్ధమైంది ఇది : "ఎం(చేయకుండా)పవర్ (లో ఉండడం)" అంటేనే ఎంపవర్ అని!









Wednesday, January 15, 2014

వడ విత్ వర్మ!

DISCLAIMER : ఈ బ్లాగ్ లో ఉన్న పాత్రలు (వడలు తెచ్చిన పాత్రలు కాదు) కల్పితం కాదు కానీ  మాట్లాడుకున్న మాటలు అన్నీ కల్పితం.  ఏదో సరదా కోసం చేసిన ప్రయత్నం... 

ఆ మధ్య ఎప్పుడో ఇంటర్నెట్లో పుస్తకాల షాపుకెళ్ళి చూస్తుంటే "వోడ్కా విత్ వర్మ" అనే పుస్తకం కనపడింది. రాంగోపాల్ వర్మ మీద పుస్తకం అది.  ఏమి ఉంటుందా ఆ బుక్ లో అని ఆలోచిస్తూ అలాగే ఆ రోజు నిద్దరోయాను.

ఆ పక్క రోజే కల వచ్చింది -  నేను వర్మ ని ఇంటర్వ్యూ చేసినట్టు !!! మొదట్లో ఇంటర్వ్యూ కి రాను అన్నాడు. నేను మీ "RGV ki AAG" చూసాను. కాబట్టి ఛాన్స్ ఇవ్వాల్సిందే అన్నాను ...ఇంకేమీ అనకుండా ఒప్పుకున్నాడు!
ఇంటర్వ్యూ ఇలా సాగింది ......

నేను: "నమస్కారమండి వర్మగారు! 'గుండె కోసే కత్తి' ప్రోగ్రాం కి స్వాగతం!!"
RGV: "నమస్తే గాని ఎవరు మీరు? ఎప్పుడు చూడలేదే? ఎక్కడా వినలేదే? మీ గురించి మీ ప్రోగ్రాం గురించి?"

(మళ్ళీ అదే ప్రశ్న)

నేను: "నా పేరు కత్తి కాంతారావు. కత్తి లాంటి బ్లాగులు ఇంటర్నెట్లో రాస్తుంటాను"
RGV: "అవునా! 'గుండె కోసే కత్తి' అంటే గుండె గురించి కత్తుల గురించి అడుగుతారనుకున్నా. నాకు తుపాకులు, అడవులు, దయ్యాలు, మాఫియాలు తప్ప ఇంకేమి తెలివు"

నేను: "ఇక్కడ నేను కత్తిని. నా ప్రశ్నలతో మీ గుండెలో నుండి జవాబులు రాబడతా. అందుకే అలా పేరేట్టాను"

(ఇంతలో వేడి వేడి గా వడలు వచ్చాయి )

నేను: "వోడ్కా ఇవ్వటానికి మాకంత బడ్జెట్ లేదు. అందుకే వడలు తెప్పించాం. తీస్కోండి. నెమ్మదిగా తినండి. ప్రోగ్రాం చివరి దాకా రావాలి"
RGV: "మీరు RGV ki AAG చూసినప్పుడు, నేను వడలు తినలేనా"

నేను: "మీకు ముందే తెల్సా ఆ సినిమా పోతుందని... ?"
RGV: "లేదు... నేను ఏ టేస్ట్ తో తీసానో ... అదే టేస్ట్ తో ప్రేక్షకులు చూడలేదు ... అందుకే పోయింది"

నేను:  "అంటే RGV ki AAGAM అని పెట్టుంటే బాగుండేది అని జనాలు అనుకున్నారు"
RGV: "అనుకున్నది జనాలా మీరా?? ఎవరేమనుకున్నా నేనేమి పట్టించుకోను"

(నాకు నమ్మకం కుదిరింది ... నేను RGV  నే ఇంటర్వ్యూ చేస్తున్నా అని... నేనేదో modest గా అన్నాడేమో వడలు తినలేనా అని అనుకున్నా మొదట్లో )

నేను: "మీరు అడవి సినిమాకి కొనసాగింపు తీస్తున్నారా"
RGV: "అవును ... ఒక సీక్వెల్ ..ఒక ప్రీక్వెల్"

నేను:  "పేర్లెంటో తెల్సుకోవచ్చా"
RGV: "ప్రీక్వెల్ పేరు చిట్టడవి ... సీక్వెల్ పేరు కారడవి"

నేను:  "సబ్జెక్టు ఏంటో"
RGV: "అడవుల్లో ఉండే మాఫియాలు... వాళ్ళు కాల్చే తుపాకులు  ..చచ్చి తిరిగే దయ్యాలు...'డిఫరెంట్' కాన్సెప్ట్"

నేను:   "డిఫరెంట్?!"
RGV: "అవును ... నేను ఎంత డిఫరెంట్ గా తీసిన మీకు నచ్చకపోతే మీరే డిఫరెంట్ పర్సన్ అని అర్ధం!!"

నేను:  "మీ పోయిన సినిమా ..సారీ! మీరు పోయినసారి తీసిన సినిమా "డిపార్టుమెంటు" ఎందుకు ఫ్లాప్ అయింది?"
RGV: "నా కాన్సెప్ట్ లో ప్రాబ్లెమ్ లేదు"

(కాన్సెప్ట్ అంటే తుపాకులు మాఫియా పోలీసులు ... షరా మామూలే అని అర్ధం)

నేను:  "మరి?"
RGV: "సంజయ్ దత్ ని పెట్టుకోవటం పెద్ద తప్పు. కెమెరా వైపు చూడకుండా నటించి పారేసాడు. నాకు చెప్పి చెప్పి విసిగోచ్చి అలాగే తీసి పారేసాను"

(ఈయన ఎక్కడ పడితే అక్కడ కెమెరాలు పెడతాడు... అసలే కష్టపడి నటించే సంజయ్ కి అర్ధమయ్యి ఉండదు ... కెమెరా ఎక్కడ ఉందో)

నేను:  "ఎవరూ ఊహించని ప్రదేశాల్లో కెమెరాలు పెట్టాలని మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఎంతైనా డిఫరెంట్ గా ఆలోచిస్తారు"
RGV: "అది నా హాబీ... ఖాళి సమయాల్లో అదే నా టైం పాస్... ఇంట్లో కుర్చుని మా ఇంట్లో ఎక్కడెక్కడ కెమెరాలు పెట్టొచ్చా అని ఆలోచిస్తుంటా"

నేను:  "మీరు రంగీలా లాంటి సినిమా మళ్ళీ తీయలేదే"
RGV: "నాకూ రొమాన్స్ కి పడదు.. అందుకే తీయలేదు"
నేను:  "సినిమా హిట్టైంది గా?"
RGV: "అయితే నాకేంటి? నేనింతే!"

నేను:  "మీరూ రానా టచ్ లోనే ఉంటారా?"
RGV: "ఏమో డిపార్టుమెంటు రిలీజ్ తర్వాత కలవలేదు తను"

(కలవలేదా? దొరకలేదా??)

నేను:  "సత్య సూపర్ హిట్టు ... మరి సత్య-2 ఎందుకు ఫట్టు?"
RGV: "అంతా ఆ ధనలక్ష్మి దయ!"
నేను:  "అది తెలుగు లో .. మరి హిందీ లో?"
RGV: "ఆ హిందీ జనాలు నాకు అర్ధం కారు... వాళ్ళని చూసి తెలుగు జనాలు కుడా అలానే తయారవుతున్నారు... "డిఫరెంట్" కాన్సెప్ట్ ఫిల్స్మ్ ఎలా చూడాలో తెలిదు వాళ్లకి"

నేను:  "డిఫరెంట్ అంటే?"
RGV: "ముంబై కి సింగిల్ గా వచ్చిన హీరో మాఫియా డాన్ ఎలా అయాడు? ఎంత డిఫరెంట్ కాన్సెప్ట్"
నేను:  "ఆల్రెడీ పూరి బిజినెస్ మాన్ లో అలాంటి కాన్సెప్ట్ తోనే ఉచ్చ పోయించాడు కదా"
RGV: "రెండు సేమ్ కాన్సెప్ట్స్ కావు ... మీకు అర్ధం అయినట్టు లేవు"
నేను:  ".."
RGV: "వడలు బావున్నాయి"

(నాకెందుకో ఆ వడలు నచ్చలేదు... బాలేదంటే మళ్ళీ టేస్ట్ లేదు మీకు అంటాడేమో అనుకుని నవ్వాను)

నేను:  "మీకు కరణ్ జోహార్ కి ఎందుకు పడదు?"
RGV: "నేనేదైనా ఓపెన్ గా చెబుతాను ... ఆయన సినిమాలు నాకు నచ్చవు.. అదే చెప్పాను.."
నేను:  "ఆయనకి మండింది గా"
RGV: "మండనివ్వండి... నాకేమి ప్రాబ్లం లేదు"
నేను:  "ఆయన తీసిన సినిమాలు అన్నీ ఆడాయిగా?"
RGV: "అదే అర్ధం కాదు... ఆయనేమో కాలేజీలో కింద కాయితంముక్క లేకుండా లవ్ స్టొరీ తీస్తే ఎగబడి చూస్తారు.. నేనేమో కష్టపడి అడవుల్లోకెళ్ళి దెబ్బలు తగిలించుకుని సినిమాలు తీస్తే ఎవడికి నచ్చదు... ఆయనేమో న్యూయార్క్ బ్యాక్డ్రాప్ పెట్టి పాటలు పెడితే ఎంజాయ్ చేస్తారు.. నేనేమో నాచురల్ స్టోరీస్ చూపిస్తే చూడరు... "
నేను:  "నాచురల్ స్టోరీస్ అంటే?"
RGV: "చూసారా మీకు కూడా తెలీదు... "
నేను:  ".."


నేను:  "2013 లో మీకు కలిసొచ్చిందా?"
RGV: "బాగా!... జంజీర్ రీమేక్ వచ్చి RGV ki AAG ని రెండో ప్లేస్ కి తోసేసింది... ఐ యాం వెరీ హ్యాపీ!"
(ఈ ప్లేస్ ల గొడవేంటో మీకు తెల్సుగా)

నేను:  "జంజీర్ రీమేక్ ఎందుకు పోయిందంటారు?"
RGV: "అది ఆయిల్ మాఫియా సబ్జెక్టు... మాఫియా సబ్జెక్టు సరిగ్గా డీల్ చేయలేదు... "
నేను:  "జనాలకి ఆయిల్ మాఫియా ఏంటో అర్ధమవలేదేమో?"
RGV: "దానికన్నా రామ్ చరణ్ ఎక్స్ప్రెషన్స్ అర్ధమై ఉండవు"
నేను:  "పాపం ఆయనకీ హిందీ అర్ధమయి ఉండదు లెండి"

నేను:  "మీరు బాలకృష్ణ తో సినిమా చేయొచ్చు కదా... ఎలా ఉంటుందా అని ఆసక్తి నాకు"
RGV: "ఎందుకు?"
నేను:  "ఎందుకంటే క్రేజీ కాంబినేషన్ కదా... "
RGV: "జోగి జోగి రాస్కుంటే ప్రపంచం అంతా బూగి-ఊగి అయిందట"
నేను:  "మీరు మరీ ఓపెన్ గా మాట్లాడుతున్నారే!?"
RGV: "ఇంకా ఓపెన్ గా మాట్లాడగలను... "
నేను:  "చెప్పండి ఏంటో"
RGV: "నువ్వో పెద్ద పనికి మాలిన వాడివి.. పని పాట లేక బ్లాగులు రాస్తుంటావు"

నాకు వెంటనే మెలుకువ వచ్చింది... లేచి ఆఫీసు లో పని చేసుకోసాగాను!


Friday, January 10, 2014

నేను నా స్కూలింగు - 1

ఇంగ్లీష్ లో బోల్డు పదాలు నాకు తెల్సు గాని...స్కూలింగ్ అంటే  అర్ధమెంటో  ఈ మధ్యనే తెల్సింది! అసలు అర్ధం తెల్సేవరకు స్కూలింగ్ అంటే స్కూల్ కి  వెళ్ళటమే అనుకునేవాడిని...మీకు కుడా తెలీకపోతే డిక్షనరీ చూస్కోండి... నాకు అందులో చూస్తే అర్ధం కాలేదు! అర్ధమైన దాని ప్రకారం రాసుకుంటూ పోతున్నా .... మీరు చదువుకుంటూ వచ్చేయండే!


నాకు "ఊహ" తెలిసే సరికి  పదో తరగతి లో ఉన్నా...(అప్పుడే 'ఆమె' సినిమా చుసాలే... అహహ...  చూపించారులే )అప్పటిదాకా ఎలా చదివానో తెలీదులెండి...పదో తరగతి లో భయంకరంగా బట్టీలు పట్టేసి వాటి వల్ల మెడలు పట్టేసి మన రాష్ట్రం లో నే  ఫస్ట్ వచ్చా! తర్వాతే తెల్సింది స్కూల్ ఫస్ట్ అని..మన రాష్ట్రం లో వేరే స్కూల్స్ ఉన్నాయని...ఒక్క స్కూలే ఉంటె ఎంత బాగుండేది...తస్సాదియ్యా..!

పదో తరగతి పరీక్షలు అయ్యాక నన్ను అడిగారు..."ఎరా? ఏమవుదామనుకుంటున్నా? " అని... నేనేమో నోటికి వచ్చింది వాగేశా... మా అమ్మ నాన్నల కళ్ళల్లో దీపావళి కాంతులు చూసా...అపుడే అర్ధమైంది చాలా సోది చెప్పానని...వెంటనే ఆపేసా!

మా వాళ్ళు యేవో ఏవేవో ఇంకేవో మరేవో మాట్లాడేస్కుని...నన్ను ఇంటర్ లో M.P.C గ్రూప్ లో పడేసారు...అపుడర్ధమైంది నా సొల్లు ఉరఫ్ సోది కి ప్రతిఫలం  జూనియర్ కాలేజీ లో లెక్కలు, రసాయనాలు మరియు భౌతిక శాస్త్రాలు చదవాలని...

ఇంతకి నేను వాళ్లకి వేసిన సోది ఏమిటంటారా...దూలగా ఉంటె చదువుకోండి...మళ్ళీ నన్ను తిడితే బాగోదు...
1.  దేశం గర్వించదగ్గ మనిషినవ్వాలి...(అమ్మ నాన్న కళ్ళల్లో కాకరపువ్వొత్తుల కాంతి..)
2.  గొప్ప శాస్త్రవేత్తనవ్వాలి... (మతాబులు కూడా తోడు అయ్యాయి)
3.  నోబెల్ బహుమతి రావాలి...(50000 వాలా )
4. ఇంక నేను ఆపేసా...(కరెక్ట్ గా చెప్పాలంటే నాన్న అనుమానంగా చూసాడు)
మీకు పాయింట్లు చెప్పా కాని...వాళ్ళతో చాలా చెప్పా...ఈ వయసులో ఇలాంటి ఉద్యోగం చేస్తూ అలాంటి మాటలు ఇపుడు చెప్పాలంటే ఎవడికి గుర్తు...నన్ను వదిలేయండి బాబు... ఇప్పటికి అమ్మ అంటూ ఉంటుంది నీకు ఉద్యోం ఇచ్చిన వెధవ ఎవడ్రా అని .... చెప్తామా ఏంటి?

పదవ తరగతి పాసయ్యాక ఉద్యోగం ఏమి రాలేదు ... ఇంకా ఎక్కువ చదవాలి కాబోలు అనుకుని ఇంటర్మీడియట్ చదువుదామని నిర్ణయించుకున్నా... అది కూడా ఆంగ్ల మాధ్యమం లో (ఇంగ్లీష్ మీడియం అని అంటున్నారు ఇపుడు తెలుగులో)

ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో(ఆంగ్ల మాధ్యమం కదా కొంచెం తెంగ్లిష్ వాడేను) ఉండగా ఒక రోజు మా ఫ్రెండ్ నన్ను "ఒరేయ్! projectile అంటే ఏంది రా?" అనడిగాడు...నేనేమో "అబ్బ నాకు అర్జెంటు పని ఉంది రా" అని చెప్పేసి ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయా ..లేకపోతే ఎవరైనా గొప్ప శాస్త్రవేత్తని పట్టుకుని అలాంటి చిన్న ప్రశ్నలు అడుగుతారా..?

పదవ తరగతి దాకా తెలుగు మాధ్యమంలో చదివిన నాకు ఒక్కసారిగా ఇంగ్లీష్ మీడియమ్ లొ చదవాల్సి వచ్చేసరికి ఏమీ అర్ధం అయ్యి చచ్చేది కాదు. అర్ధం అయ్యేలా పుస్తకాలు రాయరు కాలేజీ లో చెప్పరు. చెప్పినా కూడా నేను పడుకున్నప్పుడు చెప్తారు. ఇంక ఎప్పుడు అర్ధమవుతుంది. మన విద్యావ్యవస్థ భ్రశ్ఠు పట్టి పాయిందనిపించేది.
ఎవడన్నా వచ్చి డౌటు అడిగినా "నాకు అర్జెంటు పని ఉంది రా!" అని చెప్పేవాడిని.

ఇంటర్లో ఉన్నప్పుడే క్రికెట్ పిచ్చి పట్టుకుంది. తెగ ఆడెసెవాళ్ళమ్. అప్పట్లో దక్షిణాఫ్రికా టీం లో క్లుసెనెర్ అని ఆల్ రౌండర్ ఉండేవాడు. చివరి స్థానం లో బాటింగ్ కి వచ్చి బాదేసేవాడు. గెలిపించేసేవాడు. నేను కుడా మా టీం లో చివరి ప్లేస్ లో బాటింగ్ కి వెళ్ళేవాడిని. గెలిపించేసేవాడిని అవతలి టీం ని. అందుకే నాకు మా వాళ్ళు లూసెనెర్("lose"ner) అని పెరేట్టారు. అంటే అర్ధం వీడు బాటింగ్ కి వెళ్తే మనకి మ్యాచ్ పోయినట్టే.

క్రికెట్ మ్యాచ్ లు కాలేజీ లో క్లాసు లు బోర్ కొట్టినప్పుడు కూడా ఆడెసెవాళ్ళము. అలా ఆడాలంటే ముందర కాలేజీకి ఉన్న పిట్ట గోడ దూకాలి. ఒక రోజు అందరు దూకేసాక నేను కుడా పిట్ట గోడ మీద కాలు పెట్టాను. అప్పటికే కాలేజీ రౌండ్స్ లో ఉన్న మా ప్రిన్సిపాల్ ఆ ఏరియా లో అడుగు పెట్టాడు. ఇంకేముంది ఒక కాలు అడ్డంగా ఇంకో కాలు నిలువుగా దొరికిపోయాను. 

నన్ను పిలిచి  "ఎం చేస్తున్నావ్ రా" అని అడిగాడు. 
అప్పుడు నేను mentos నోట్లో వేస్కున్నాను. బుర్రలో లైటు వెలిగింది. 
"షూ లేసు కట్టుకున్తున్నానండి" అన్నాను. 
నా కాళ్ళ వంక చూసాడు. షూస్ కనపడలేదు.
నాకేమో mentos తప్పు టైం లో తిన్నానని అర్ధమైంది. చాచి లెంప మీద చెంపదెబ్బ కొట్టాడు. 
వెళ్లి క్లాసు లో పడ్డాను. క్లాసు లో ఉన్న వాళ్ళు కిసుక్కుమన్నారు. నేనేమో విసుక్కుని, చెంప రుద్దుకున్నాను. 
మళ్ళీ పిట్టగోడ దూకలేదు. 

నేనేదో కష్టపడి బట్టి పట్టి ముక్కున పట్టి (అందుకేనేమో నా ముక్కు లావుగా ఉంటుంది ఇప్పటికి )పరీక్షలు రాసి మార్కులు తెచ్చుకుంటె, నా స్నేహితులంతా నేనేదో పిస్తా అనుకునేవారు. నేనేమో బాదం పప్పేమి కాదు అనుకునెవాడిని. ఎలా"గోలా" ఇంటర్ పాస్ అయ్యాను.

మనకి ఇంటర్ లో ఏమీ అర్ధం కాలేదని ఎమ్సెట్లొ సీటు రాకపోయెసరికి అర్ధమయ్యింది. మొదట్లో ఇంటర్ చదివిన అందరికి పిలిచి సీట్లు ఇస్తారేమో అని సరిగ్గా చదవలేదు. కాని దానికి ఒక పరీక్ష ఉంటుందని తెలిసేసరికి, భయమేసి అస్సలు చదవలేదు. అసలు సీటు రావాలంటే ర్యాంకు రావాలి కదా!! చివరికి ర్యాంకుల్లేని కోటాలో ఏమన్నా సీటు ఇస్తారేమో అని కూడా ట్రై చేసి టైర్ అయ్యాను. అలాంటి కోటాలు పెట్టరు ఎందుకో?!

ఇంటర్ గట్టెక్కాక ఏమి చెయ్యాలి? అని తెగ ఆలోచించేవాళ్ళు అమ్మా,నాన్నా. నేను మాత్రం తెగ బిజిగా ఉండేవాడినిలే - తినేసి, ఆడేసి, పడుకునేసి అస్సలు టైము తెల్సేది కాదు. మా నాన్నకి నేను ఇచ్చిన దీపావళి దెబ్బ తగ్గలేదేమో, నన్ను లాంగ్ టెర్మ్ ఎమ్సెట్ కోచింగ్ లో పడేసాడు. ఎందుకంటే ఇంటికి వచ్చిన ప్రతి చుట్టం "ఏదో ఒకరోజు నీ కొడుకు ఇంజనీర్ అవుతాడు అయ్యి తీరుతాడు" అని చెప్పటమే. 

ఏదో బద్దకంగా బతుకీడుస్తున్న బాలుడిని బాగా (బ గుణింతం డైలాగు - రమణ గారు కోతి కొమ్మచ్చి లో రాసినట్టు) చదవమని, చదివి మంచి ర్యాంకు తెచ్చుకోమని, తెచ్చుకొని మంచి కాలేజీ లో మంచి సీట్ రావాలని అలా పడేసారు. మంచి సీట్ అంటే కంప్యూటర్ సైన్స్ అనమాట.ఈ రోజుల్లో అర్ధాలు వేరులెండి.  కంప్యూటర్ సైన్స్ వాళ్లకి జాబ్స్ రాకపోతే ఎలక్ట్రానిక్స్ మంచి సీట్ అని అర్ధమ్ లేదా వయసు వరస (viceversa అని ఇంగ్లిష్ లో అర్ధం!!)

ఈ లాంగ్ టర్మ్ ఉంది చూసారు, మహా మేలు చేసేసింది మనకి. సినిమాలు ఎక్కువ సతుకులు తక్కువ. ఆఖరికి "ఎవడు తొడ కొడితే రైలింజిన్ రయ్యిమని వెనక్కి వెళ్తుందో" ఆడి సినిమాలు చూసేసే స్థాయికి వెళ్ళిపోయా. ఆ రోజుల్లో "ఎవడు రైలింజిన్ తో వస్తే జనాలు ఛీ కొట్టారో" వాడి సినిమాలు ఎక్కువగా చూసేవాడిని. సినిమాలు చూడటం ముదిరిపోయి హాస్టల్ గోడలు దూకటం అలవాటై పోయింది.  ఒకరోజు గోడ దూకితే వార్డెన్ నుంచుని ఉన్నాడు గోడవతల. ఆయనెందుకు దూకాడొ అర్ధం కాలేదు. దూకినోడు ఇంకా అక్కడె ఎందుకు ఉన్నాడో అస్సలు అర్ధం కాలేదు.

కొంతమంది కళ్ళతోనే మాట్లాడేస్తుంటారు. మా వార్డెన్ కుడా అలాంటొడే అని నాకు అప్పుడు అర్ధమైంది. నా వెనకాలే మా ఫ్రెండ్ కుడా గోడ దూకాడు. మా వార్డెన్ కళ్ళు పెద్ధవైనావి. నా గుండెచప్పుడు కుడా పెద్దదైంది. నెమ్మదిగా అన్నీ అర్ధం అయినాయి కాని ఏమి చేయాలో ఏమి చెప్పాలో అర్ధం కాలేదు.

"ఎక్కడికి పోతున్నార్రా?" అన్నాడు వార్దెను.
"సినిమాకి" అన్నాడు ఫ్రెండు.
"నేను కాదండి" అన్నాను నేను.  నా జీవితం లో మొదటిసారి వెయ్యవ అబద్దం చెప్పాను.
మా ఫ్రెండు అయోమయంగా చూసాడు . నేనేమో అమాయకంగా చూసాను నువ్వేవడివో నాకు తెలీదు అన్నట్టు. వార్డెను అనుమానంగా చూసాడు వేసిన వేషాలు చాల్లే అన్నట్టు.

"మరి నువ్వెందుకు గోడ దూకావ్ రా ?" అన్నాడు వార్డెను నన్ను చూసి. 
"ఊరికేనండి, గోడెంత ఎత్తు ఉందా అసల దూకగలనా లేదా అని చూద్దామని దూకానండి" అన్నాను.  మీకు నచ్చకపోతే దూకనండి, ఇపుడే వెళ్ళిపోతాను అనేసి వెళ్లి గోడ పట్టుకున్నాను. ఆయన వచ్చి నన్ను పట్టుకున్నాడు.
మా ఫ్రెండేమో వాడికెందుకు ఈ ఐడియా రాలేదా అని తల పట్టుకున్నాడు (అలా అర్ధమైంది మరి, మనకి  మనం తప్ప అందరు వెర్రోళ్ళే కదా)

వార్డెను అక్కడే బ్లాగులో రాయాలేని  కొన్ని పదాలు వాడి సినిమాకి వెళ్ళాలనే మా ఆశలకు తూట్లు పొడిచాడు. 

"ఏమి సినిమాకి రా ?" మళ్ళీ ప్రశ్న.
"విజయేంద్ర వర్మకండి" జవాబు.
"మరి ముందే చెప్పొచ్చు కదరా, వెళ్లి రండి" అనేసి "అదోలా" నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు.
"అదోలా" నవ్వు చూసి మాకు "ఏదోలా" అర్ధమయ్యి (ఆయన విజయేంద్ర వర్మ ఫ్యాన్ ఏమో అని),సినిమాకి వెళ్ళిపోయాం.

సినిమా చూసాక అర్ధమైంది వార్డెను నవ్వుకు అర్ధమేంటో  (అదోలా not equal to ఏదోలా). 

సినిమా చూసి, దారిలోనే జండుబామ్ వాసనాచూసి, తలకు రాసి హాస్టల్ కి వచ్చాము. దారిలో మా ఫ్రెండు రైల్ ఇంజిన్ కింద తల పెట్టుకుంటానని ఒకటే గోల. ఆ ముచ్చటా కానిద్దామని వెళితే పెద్ద Q ఉంది. ఒక్క సినిమాకి ఇంత మంది బలా అనుకుని చిరాకేసి హాస్టల్ కి వెళ్ళిపోయాము. 

హాస్టల్ కి వచ్చాక వార్డెను పట్టుకున్నాడు మళ్ళీ.
"ఎలా ఉందిరా" (దూల తీరిందా అని అర్ధం)
"చావాలనిపిస్తోందండి"
"మీకు చావాలని ఉన్నప్పుడు మీకోసం కాకపోయినా మీ వాళ్ళ కోసం బతకండి రా" అన్నాడు.
అప్పుడు మా వార్డెను నాకు గీతోపదేశం చేస్తున్న కృష్ణుడిలా కనిపించాడు.  దానితో ఎంసెట్ బాగా రాసి మంచి ర్యాంకు (కాదని ఇప్పటికీ అన్నయ్య తిడుతుంటాడు) తెచ్చుకుని మంచి కాలేజీ లో (కాలేజీ వాళ్ళే చెప్పారు) మంచి సీట్ తెచ్చుకున్నా(నేనే చెప్తున్నా)

మీకు ఇంకా ఓపిక ఉంటే చెప్పటానికి చాలా ఉన్నాయి, బీటెక్ ఎంటెక్ లో చేసినవి. అవన్నీ మళ్ళీ చెప్తానే.... మళ్ళీ రెండో భాగం లో కలుద్దాం!