Sunday, June 15, 2014

పొట్టకి పలకలు....కండల్లో బంతులు...

ఈ మధ్య లావైపోతున్నావ్ అని మా ఫ్రెండ్ అన్నాడు మొన్న. పట్టించుకోలేదు నేను. ఇంటికెళ్ళి అమ్మనడిగా. సన్నగానే ఉన్నావ్ కదరా అసలు ఏమి తినటం లేదు కూడానూ అని చెప్పింది. పట్టించుకున్నాను నేను. ఆ తర్వాత రెండు రోజులకే మా కొలీగ్ ఒకమ్మాయి(బావుంటుంది) నువ్వు లావైపోతున్నావ్ కాంతారావ్ అన్నది. పట్టించుకున్నాను నేను. మనమంటే ఆసక్తి చూపించబట్టే కదా అమ్మాయి అలా అన్నది! కానీ పోను పోను షర్టు బిగుతై పోవడం మొదలైంది. పొట్ట కనిపించసాగింది. మళ్ళీ ఒక రోజు మా కొలీగ్ "లావైపోతున్నావ్! ఏమిటి పొట్టా?" అని అడిగింది. "కాదు వాచింది!" అని చెప్పి వచ్చేసాను. మనమంటే ఆసక్తి చూపించబట్టే కదా అమ్మాయి అలా అన్నది!! ఎంత ఆసక్తి ఉన్నా మరీ అలా నిశ్ఠూరంగా అడిగింది ఏమిటో ఆ పిల్ల! మనమంటే ఆసక్తి చూపించబట్టే కదా అమ్మాయి అలా అన్నది!!!

సరే కొంచెమైనా సన్నపడదామని ఆఫీసు రూటు మార్చి జిమ్ మీదుగా ఆఫీసుకి పోసాగాను! తర్వాత నెల రోజులకి ఆ అమ్మాయే నువ్వు బాగా బలిసిపోతున్నావ్ కాంతారావ్ అన్నది. బలిసిపోతున్నావ్ అన్నందుకు బాధ లేదు కాని "బాగా" అనే పదం వాడినందుకు బాగా బాధ కలిగింది. ఆ బాధలో ఇంకొంచెం ఎక్కువ తిన్నాను ఆ రోజు.

జిమ్  మీదుగా ఆఫీసు కి వెళ్ళటం వల్ల ఉపయోగం లేదని, జిమ్ కి వెళ్ళాల్సిందే అని నిర్ణయించుకున్నాను. అదే రోజు బయట షాపింగ్ కి వెళ్లి ఆరు పలకల ఫోటో ఒకటి, ఎనిమిది పలకల ఫోటో ఒకటి తెచ్చి రూములో అతికించాను. ఫోటో ఎవడిది అయితేనేమి పలక ఉందా లేదా అనేది లెక్క. అప్పుడు లెక్కలు వేశాను. మన దగ్గర ఉన్న పేద్ద బండని ఆరు పలకలు చేయాలి అని. వారానికో పలక తెచ్చుకుంటే ఆరు వారాల్లో ఆరు పలకలు ఎనిమిది వారాల్లో ఎనిమిది పలకలు అని అనుకుంటుంటే ఒక సందేహం వచ్చింది. ఎవడైనా ఎనిమిదికి మించి పలకలు చేయరెందుకో అని. పది పలకలు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాలి అని నిర్ణయం తీసేసుకున్నాను.

కొత్త పిచ్చోడికి పొద్దెరగదని ఆ వేళ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. పెన్ను తీస్కుని పొట్ట మీద ఆరు పలకలు గీస్కుని చూస్కోటమే సరిపోయింది. పొట్టకి పలకలు రావాలి కండల్లో బంతులు రావాలి దానికోసం ఏమైనా చేయాలి అనుకుంటూ కూర్చున్నాను. తెల్లారింది. ముందు రోజు కొన్న ప్రోటీన్ షేక్ కలుపుకుని తాగేసి చక్కా జిమ్ కి పోయాను.

జిమ్ నాలుగో అంతస్తు లో ఉంటుంది. మెట్లతో పాటు లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది. ఈ రెండింటి ముందర ఒక చోట రాసి ఉంది - "సాధకుడివైతే మెట్లెక్కి రా సోదిగాడివైతే లిఫ్ట్ ఎక్కిరా" అని ఉంది. ఈ లోపు ఎవడో ఒకడొచ్చి లిఫ్ట్ లో పైకి వెళ్ళాడు. నేను కూడా చదివినది మర్చిపోయి(మీరు నమ్మారంటేనే) లిఫ్ట్ లో పైకి వెళ్లాను. జిమ్ కి వెళ్లాను. ట్రైనర్ కలిసాడు. దేనికి జిమ్ కి వస్తున్నారు అన్నాడు. ఆరు వేళ్ళు చూపించాను. నా ఫ్యామిలీ ప్యాక్ చూసి నోరు తెరవబోయి సభ్యత కాదని తమాయించుకున్నాడు. ఈ ఒక్కటి ఆరు కింద మారాలంటే మీరు చాలా మారాలి కష్టం మరి, చేస్తారా అన్నాడు. చస్తారా అన్నాడో చేస్తారా అన్నాడో నిర్ధారించుకుని చేస్తాను అన్నాను. ఇంకా మనం పది వేళ్ళు చూపిస్తే గుడ్లు బయటకొచ్చేలా చూసేవాడేమో పిచ్చి కూన  అనుకున్నాను.

"ముందర వంద బస్కీలు తీయండి" అన్నాడు ట్రైనర్. మూడు వేలు ఫీజు దొబ్బేసి బస్కీలు తీయమంటాడేమిటి చవకగా అనుకున్నాను. మొదటి రోజు కదా అని ఏమి అనకుండా వదిలేశాను. సరే పది నిమిషాల్లో బస్కీలు తీసి పడేస్తే పోలా.. పడుంటాడు అనుకున్నాను. పది నిమిషాల్లో ఎనిమిది బస్కీలు తీసి నేను కింద పడుకున్నాను.  అప్పుడర్ధమైంది బస్కీలు విస్కీ కన్నా వేగంగా మనిషిని పడేస్తాయని. లిఫ్ట్ ఎక్కి వస్తేనే ఇలా ఉంది మెట్లెక్కి వచ్చి ఉంటే వార్నాయనో అనుకున్నాను. ట్రైనర్ వచ్చి ఇంకా అవలేదా అన్నాడు ... నా పనో లేక బస్కీల గురించి అన్నాడో అర్ధం కాలేదు. ఇవాళ్ళ వంద తీస్తే గాని వేరేది ఏమి చెప్పేది లేదు అన్నాడు. నాకు రోషం తగ్గక సరే అన్నాను. "స్పిరిట్ అంటే అది" అనేసి వెళ్ళిపోయాడు.

"కాసేపాగి" మళ్ళీ లేచి పది నిమిషాల్లో ఆరు బస్కీలు తీసి ఏడోది తీయబోతుంటే ఏడుపొచ్చింది. మూడు వేలు గుర్తొచ్చి భాదేసింది... ఇవన్నీ శరీరం తట్టుకోలేక కిందకి లాగేసింది. అంత ఆయాసంలోను కింద పడుకునేసరికి సమ్మగా అనిపించింది. అప్పటికే జిమ్ కి వచ్చి గంట పైనే అయింది. రెండు అడుగుల దూరంలో ఉన్న నీళ్ళ సీసా ఎక్కడో ఆఫ్రికాలో ఉన్నట్టు అనిపించింది. ఎలాగోలా పాకుకుంటూ ఇంటికి వెళ్ళిపోదామని అనిపించింది. వేదం సినిమాలో అల్లు అర్జున్ లా "దీనమ్మ జీవితం" అని అరవాలనిపించింది.

కాసేపాగి(మీకు ఎంత టైం అనిపిస్తే అంత అనుకోవచ్చు) మళ్ళీ ట్రైనర్ (వెధవ :P ) వచ్చాడు. "ఎన్ని బస్కీలు తీసారు" అన్నాడు. "పధ్నాలుగు" అన్నాను లోగొంతుకతో. వాడి దిక్కుమాలిన చెవికి "నాలుగు" అని వినిపించినట్టుంది. "గంట నుండి నాలుగా తీసింది.. ఇలా అయితే మీరడిగిన ఆరు ఆరేళ్ళు అయినా రాదు" అన్నాడు. ఇలా తీసేయండి చూడండి అంటూ ఐదు నిమిషాల్లో యాభై బస్కీలు నా ముందర తీసేసి వెళ్ళిపోయాడు. నా కనుగుడ్లు బయటకొచ్చి పడిపోబోతుంటే లోపలకి పెట్టేస్కున్నాను. ఏమిటో ఎదుటివాడు తీస్తుంటే చాలా సులభం అనిపిస్తుంది! మనం తీస్తుంటే, ఆ తీసే ఒకటో రెండిటికో యమధర్మరాజు కనిపిస్తున్నట్టు ఉంటుంది. బస్కీలు తీయటం అంత "పాపం" ఇంకోటి లేదనుకుంటా!

బస్కీలు చూడటానికి బానే ఉంటాయి. చేయటానికే బాగుండవు. ఇది అర్ధమైంది  నాకు జిమ్ కి వెళ్ళిన తర్వాతనే. ఇప్పటికీ ఎవరన్నా బస్కీలు తీస్తుంటే "ఎంత గొప్పవాడో వీడు" అనుకుంటూ ఉంటా.

మరి కాసేపాగి ట్రైనర్ (దరిద్రుడు :P) మళ్ళీ వచ్చాడు. ముందే చెప్పాకదా కొత్త పిచ్చోడు పొద్దు ఎరగడని. వీడికేమో  నేను కొత్త, నన్ను ఆడేసుకుంటున్నాడు. "ఇవాళ్టికి బస్కీలు చాలు, వేరే ఏమన్నా చెప్పండి" అన్నాను. "పుషప్స్ చేయండి" అన్నాడు. "వోస్ అదెంత!?" అన్నాను. "మీలో ఉన్న ఈ స్పిరిటే మీకు పలకలు తెచ్చేస్తుంది. గుడ్!" అనేసి పోయాడు.

బోర్లా పడుకుని పైకి లేచేయటమే పుషప్స్ అంటే అనే తెల్సు మనకి. కాకపోతే చేతులతో కొంచెం పైకి పుష్ చేయాలంతే. ప్రయత్నించాను. తల, భుజాలు తప్ప ఇంకేమి లేవలేదు. మళ్ళీ వచ్చాడు ట్రైనర్ (చచ్చినోడు :P ). "మీరు పుషప్స్ చేయటం లేదు పుష్ డౌన్స్ చేస్తున్నారు" అన్నాడు నవ్వుతూ. "ఇలా చేయాలి" అని కొన్ని (ఎన్నో నేను చెప్పను) చేసి చూపించాడు. "ప్రయత్నిస్తున్నా రావటం లేదు" అన్నా. ఎవరో అబ్బాయికి చెప్పి ఏదో బెల్ట్ తెమ్మన్నాడు. కొడతాడా కొంపదీసి అనుకున్నాను. కొట్టబోతే "ఎంత పొట్టకి అంత పుషప్" అని కవర్ చేస్కోవాలి అనుకున్నాను.

ఏదో బెల్ట్ తెచ్చాడు ఆ అబ్బాయి (వెధవ :P ). వాడి ముఖం గుర్తుపెట్టుకున్నాను, ఎక్కడైనా కనపడితే బెల్టుతో బాదేద్దామని. వ్యాయామం చేసేవాడోకటి తలిస్తే చేయించేవాడు ఇంకోటి తలుస్తాడంట.  బెల్ట్ తెప్పించింది నా నడుము చుట్టూ వేసి నేను పుషప్స్  చేసేటప్పుడు పైకి లాగటానికని అర్ధమైంది. అలా ఒక పది చేసాక ఇంకా చాలు విశ్రాంతి తీస్కోమని చెప్పి వెళ్ళాడు ట్రైనర్ (దేవుడు :P ). నాకేమో ఎవరికీ కనపడకుండా పాక్కుంటూ పారిపోదామనిపించింది. అది కూడా అయ్యేలా లేదని తెల్సి, ఎవడన్నా వెళ్తుంటే వాడి కాలు పట్టుకుని  ఇంటి దాకా లాక్కెళ్ళరా పుణ్యముంటుంది అని అడుక్కోవాలనిపించింది.

మళ్ళీ వచ్చాడు ట్రైనర్ (పిచ్చోడు  :P). "ఇవాళ్టికి చాల్లెండి. మీ ఫిట్నెస్ చూద్దామని, మీకు కూడా చూపిద్దామని ఇవన్నీ చేయమన్నాను. పలకల కోసం మీరు చాలా దూరం ప్రయాణించాలి. సో గెట్ రెడీ. ఆఫీసు కి వెళ్లి ప్రోగ్రామ్స్ రాసుకుంటూ రేపటికి రెడీ అవ్వండి" అన్నాడు. నేను మనసులో అనుకున్నాను - "ఇంత జావ కారిపోయాక జావాలో ప్రోగ్రామ్స్ ఇంకేమి రాస్తాం" అని. ముకుళిత హస్తాలు జోడించి ట్రైనర్(మహానుభావుడికి :P)కి నమస్కారం చేసి, అక్కడే ఇంకో గంట(నుకుంటా) కూర్చుని, పేపర్ చదివి(నట్టు నటించి), ఇంటికి వచ్చాను. ఆ వేళ సెలవు పెట్టి పడుకున్నాను. మళ్ళీ పక్కరోజు పొద్దున్న ఆఫీసుకి పోయాను.

మళ్ళీ కొలీగ్ (దొంగమొహంది :P) కనపడింది. "ఏంటి లావుగా నీరసంగా ఉన్నావు కాంతారావ్?" అన్నది. "నీ పని నువ్వు చూస్కో. లేకపోతే సెక్సువల్ హరాస్మెంట్ కింద కంప్లైంట్ చేస్తా! ఆ !!" అనేసి పోయాను. డంగై పోయి చూసింది దొంగది. కొంతమంది అంతే మరీ చొరవ తీస్కుంటారు, వాళ్ళతో అలానే ఉండాలి(:P). ఉంటా!!







2 comments:

  1. "నీ పని నువ్వు చూస్కో. లేకపోతే సెక్సువల్ హరాస్మెంట్ కింద కంప్లైంట్ చేస్తా! ఆ !!

    extremely amusing post !

    ReplyDelete
  2. సెక్సువల్ హరాస్మెంట్ ..... ఆఫీసుల్లో మొగవారిని బెదిరించడానికి ఆడవారు వాడే ఆయుధం ... దాన్నే మొగవాడూ ఉపయోగించుకోవడంలో తప్పేం లేదు 🙂.

    Yes. hilarious post,

    ReplyDelete