Monday, June 9, 2014

సొంతంగా ఆలోచించే కాలిక్యు"లేటరు"

నేను బీటెక్ చదివే రోజుల్లో నా దగ్గర ఒక కాలిక్యులేటరు ఉండేది. కంపెనీ పేరు గుర్తులేదు కానీ అది చేసిన చిత్రాలు గుర్తున్నాయి.


దానిని నాన్న నేను బీటెక్ లో చేరేటప్పుడు ఇస్తూ ముత్తాతల నుండి వస్తున్న ఆచారం ప్రకారం ఇది నీకు ఇస్తున్నాను అన్నాడు. ఇచినప్పుడు బానే ఉంది కాకపోతే అదే రోజు బ్యాగ్ లో పెట్టుకోబుతుంటే కింద పడింది. దానిలో ఉండే పార్ట్లు అన్నీ కదిలేలా పడింది రెండు ముక్కలైంది. నేనేమో రెండు అతుకులు వేసి సరి చేశాను.

అసలు కథ తర్వాత రోజు క్లాసు లో మొదలైంది!

ఇంగ్లీష్ క్లాసు బోర్ కొట్టి మా ఫ్రెండు ముందు  బిల్డప్పు ఇద్దామని బ్యాగులో నుండి కాలిక్యులేటరు తీసి  బల్ల మీద పెట్టాను. వాడేమో కొత్త కాలిక్యులేటరు తీసి బయట పెట్టాడు. హఠాత్తుగా ఇంగ్లీష్ క్లాసు ఆసక్తి కరంగా మారిపోయింది.

కాసేపాగి 9x2 ఎంతో చూద్దామని సరదా పడి కాలిక్యులేటరు లో మీటలు నొక్కాను. "92" అని చూపించింది. కింద పడ్డాక 'x' మీట పని చేయటం లేదేమో అని మళ్ళీ అదే లెక్క చేసాను ఈ సారి 'x' మీట కొంచెం గట్టిగా నొక్కాను. ఈ సారి "18" అని చూపించింది. కర్రెక్టా కాదా అని ఫ్రెండు కాలిక్యులేటరు లో చేసి చూసాను. అంతే చూపించింది. హమ్మయ్య నా కాలిక్యులేటరు పని చేస్తోంది అనుకున్నాను.

తర్వాత ఇంజనీరింగ్ మెకానిక్స్ క్లాసు. మా ప్రిన్సిపాలే చెప్పేది కూడా. ఆ సబ్జెక్టు లో భయంకరమైన లెక్కలు ఉంటాయి. మొదట ఏదో చిన్న ప్రాబ్లం ఇచ్చాడు ... అంతా చేస్తే "43x2" చూడాల్సి వచ్చింది. చక చకా కాలిక్యులేటరు లో చేసి చూసి "36" అని రాసేసాను.

మా ప్రిన్సిపాల్ కి ప్రాబ్లం ఇచ్చి క్లాసు లో రౌండ్స్ వేయడం అలవాటు ఎలా చేస్తున్నారో చూద్దామని. నా దగ్గరికి వచ్చాడు. నేను పుస్తకం ముందరకి జరిపి కాల్గేట్ నవ్వు నవ్వాను. ఆయన సీరియస్ గా నా వైపు చూసాడు. నాకు డౌట్ వచ్చి పుస్తకం వైపు చూసాను.  "నీకు చేయటం రాకపోతే కాలిక్యులేటరు వాడొచ్చు గదా. ఎందుకు ఇలాంటి పనులు చేస్తావు" అనేసి వెళ్ళిపోయాడు.

నేను వెంటనే మా ఫ్రెండు కాలిక్యులేటరు లాక్కుని లెక్క చేసి చూసాను. "86" అని వచ్చింది.

"ఏరా పని చేయటం లేదా కాలిక్యులేటరు?" అన్నాడు ఫ్రెండు.
"కాదు... ఎలా పని చేయించాలో తెలీటం లేదు" అన్నాను.

నా కాలిక్యులేటరు తీస్కుని "43x2" మూడు సార్లు చేసాను. 73, 86, 86 అని చూపించింది. "ఓహో.. బెస్ట్ అఫ్ త్రీ" అన్నమాట అని నిర్ణయించుకున్నాను.

"ఇంకో సారి చేసి చూడరా... ఇంకేమి చిత్రాలు చూపిస్తుందో" అన్నాడు ఫ్రెండు.

మళ్ళీ చేసాను. ఈ సారి 56, 74, 86 చూపించింది. మా వాడు రూపాయి నాణెం ఇచ్చాడు. టాస్ వేసి ఆ మూడిటిలో ఏదో తేల్చుకోమని!!! తేలిస్తే 86 వచ్చింది. హమ్మయ్య అనుకున్నాను. ఇంకోసారి అనబోయాడు మావాడు. నేను నోరు నొక్కేసాను వాడిది.

ఇక అప్పటి నుండి అదే రకంగా లెక్కలు చేసేవాడిని. చేసాక మా ఫ్రెండ్ పుస్తకం లో చూసి కర్రెక్టా కాదా అని చూసుకునేవాడిని. చాలాసార్లు అంటే పదికి మూడు నాలుగు సార్లు కరెక్ట్ అయ్యేది.  ఒక్కోసారి వాడే లెక్క తప్పు చేసేవాడు. అప్పుడు ఎవడిది కరెక్ట్ అనేది అర్ధమయ్యేది కాదు. థర్డ్ అంపైర్ కి విన్నవించేవాళ్ళం.

ఒకసారి మా ప్రిన్సిపాల్ క్లాసు లో రౌండ్స్ వేస్తూ లెక్క చూద్దామని నా దగ్గరికి వచ్చాడు. కొంచెం పెద్ద లెక్క కావటంతో నా కాలిక్యులేటరు తీస్కుని చేసి చూసాడు. ఏదో చూపించింది. మళ్ళీ చేసి చూసాడు. మళ్ళీ వేరే. ఒకే టికెట్ మీద రెండు చెత్త  సినిమాలు చూసినట్టు మొహం పెట్టాడు. నన్ను దానిని చికాకు గా చూసి వెళ్ళిపోయాడు. 

మా క్లాసు లో సుగుణసుందరి అనే అందమైన అమ్మాయి ఉండేది. నేనేమో ఆ అమ్మాయికి తెలీకుండా బీటు వేసేవాడిని. అలా బీటు వేసినప్పుడల్లా నా గుండె బీటు తప్పేది. అమ్మాయి అప్పుడప్పుడు చూసి నవ్వేది. మా ఫ్రెండు కూడా నవ్వేవాడు నా కన్నా ముందే. అప్పుడప్పుడు నేను ఆ అమ్మాయి, సంక్రాంతి ముగ్గులని, ముగ్గుల పోటీల గురించి వాటి ప్రిపరేషన్ గురించి మాట్లాడుకునేవాళ్ళం. మా అక్క వేసిన ముగ్గు చూపించి నేనే కనిపెట్టా అని గొప్పలు చెప్పేవాడిని కూడా.

ఒక రోజు ఆ అమ్మాయి కాలేజీకి రాలేదు.
నేను ఫ్రెండుతో "ఏరా.. సుసు రాలేదా?" అన్నాను.
"ఇందాకేరా పోయివచ్చాను... అయినా నా సుసు గురించి నీకెందుకు?" అన్నాడు.
"సుసు అంటే సుగుణసుందరిరా సోదిగాడా" అన్నాను.
"ఓహో ఆ సుసునా ఇవాళ రాలేదు... కొంపదీసి పెళ్ళిచూపులు ఏమో" అన్నాడు.
నాకు గుండె జారి ప్యాంటు లోకి వచ్చేసింది. 
"శుభం పలకరా మగడా అంటే శుభం కార్డు వేస్తావేమిటి రా" అని కసురుకున్నాను. 

ఆ రోజు సాయంత్రమే సుసు ఇంటికి సైకిల్ మీద వెళ్లాను, జేబులో కాలిక్యులేటరు పెట్టుకుని. లెక్కలు తేల్చుకుందామని!

వాళ్ళ అమ్మగారు(కాబోయే అత్తగారు) తలుపు తీసి కూర్చోమన్నారు.  అమ్మాయి లోపల ఉంది వస్తుంది అన్నారు.
"మంచి నీళ్ళు కావాలా" అనడిగారు.
"మర్యాదలేవి వద్దండి" అన్నాను.
వింతగా చూసి వెంటనే లోపలికి వెళ్ళిపోయారు.
అక్కడే సుసు తమ్ముడనుకుంటా కూర్చుని హోంవర్క్ చేస్కుంటున్నాడు.
"అంకుల్! మీకు లెక్కలొచ్చా?" అన్నాడు తలెత్తి.
నాకు పీకలదాకా కోపమొచ్చింది, లెక్కలొచ్చా అనడిగినందుకు. జేబు తడుముకున్నాను, చల్లగా కాలిక్యులేటరు తగిలింది. ఇంకో జేబు తడుముకున్నాను రూపాయి నాణెం తగిలింది.

అన్నీ అస్త్రాలున్న అర్జునుడిలా ఆడిని ఆగ్రహంగా (అ గుణింతం) చూసాను.
అయినా తమాయించుకుని "నేను నీకు అంకుల్ లా కనిపిస్తున్నానా?" అనడిగాను.
"ఈ లెక్క చెప్పండి. చెప్తే అంకుల్ అని పిలవను" అని వరం ఇచ్చాడు.
"ఏ లెక్క?"
"19x19 ఎంత?"
 వినగానే నా మెదడు చేతులెత్తేసింది. నా చెయ్యేమో జేబులోకి పోయింది. కాలిక్యులేటరు బయటికి తీసాను. మూడు నిమిషాలాగి రూపాయి నాణెం తీసాను. అయిదు నిమిషాలకి 281 అని చెప్పాను.
చెప్పేసరికి వాడు అప్పటికే పేపర్ మీద చేసేసి రెండో లెక్కతో రెడీ గా ఉన్నాడు.
"అంకుల్, మీ కంటే మీ కాలిక్యులేటరు కంటే నా పెన్సిల్ ఫాస్టు" అన్నాడు.
ఇంకో లెక్క చేస్తారా అన్నాడు.
ఆవేశం తో ఊగిపోతూ " ఈ సారి ఆల్  టైం రికార్డు సృష్టిస్తా" అన్నాను.

"19x21 ఎంత?" అన్నాడు.
ఈ సారి నాణెం వాడకుండా కాలిక్యులేటరు మాత్రమే వాడాలని డిసైడ్ అయ్యాను (కోపమొస్తే మెదడు పని చేయదు, ఒళ్ళు తెలీదు  కదా).  కావలసిన మీటలు నొక్కి టఖీమని చెప్పాను కాదు అరిచాను "37" అని.
వాడు అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడేటప్పుడు వై.యెస్ నవ్వినట్టు నవ్వాడు.
నాకు తల కొట్టేసినట్టు, కాళ్ళు పట్టేసినట్టు, చెమటలు కూడా పట్టేసినట్టు అయింది. బయటకెళ్ళి గొయ్యి తీసి కాలిక్యులేటరు ని పూడ్చి పెట్టేద్దామనిపించింది. ఆ రూపాయి తో సోడా కొనుక్కుని తాగాలనిపించింది.
వెంటనే లేచి "మళ్ళీ వస్తాను " అని బయటకి వచ్చేసాను. బయటకి వచ్చి వెనక్కు చూస్తే వాడు  వై.యెస్ లా మళ్ళీ నవ్వాడు. నా సైకిల్ ని 50 kmph స్పీడ్ లో తోసుకుంటూ ఇంటికి వచ్చేసాను.

మనకి ఒకటి అనిపిస్తే దేవుడికి ఇంకోటి అనిపిస్తుందంట. సినిమాల్లో చెప్తుంటారు కదా.  ఇంటికెళ్ళి నాన్నతో నాకు ఈ దిక్కుమాలిన కాలిక్యులేటరు వద్దు. ఇవాళ్ళ చిన్న పిల్లాడి ముందర పరువు పొయింది అన్నాను. దానికి నాన్నేమో "ఈ రోజుల్లో  చిన్న పిల్లలు బాగా తెలివిగలవాళ్ళురా, వాళ్ళతో పెట్టుకుంటే అంతే" అన్నారు. "కాలిక్యులేటరు  ఇచ్చింది నువ్వు లెక్కలు చేస్కోటానికి గాని  వేరే వాళ్లకి లెక్కలు చెప్పటానికి కాదు" అని కూడా అన్నారు . 

ఇలా కాదని కాలిక్యులేటరు తీసి "12x9" లెక్క చేసి మా నాన్నకి చూపించాను. "108" అని చూపించింది. దొరికింది దొంగమొహంది అని నాన్నకి చూపించాను. నాన్న అది చూసి "బానే పని చేస్తోంది కదా, నువ్వు నాకు చూపించావంటే నీకు ఎంతో తెల్సి ఉండదు. ఇప్పుడర్ధమైంది పరువు ఎలా పోయిందో" అన్నారు. (పైన BOLD లో రాసిన వాక్యాలు మళ్ళీ చదువుకోగలరు)

నాకు వచ్చిన లెక్కలు టెస్ట్ చేద్దామని, ఈ సారి "4x4" ఎంతో చూసాను. "16" అని చూపించింది. (పైన BOLD లో రాసిన వాక్యాలు మళ్ళీ  మళ్ళీ చదువుకోగలరు). ఏడుపు కూడా వచ్చింది. ఛీ ఛీ వెధవ బతుకు అనుకున్నాను. 
నా ఏడుపు పట్టించుకోకుండా నాన్న వెళ్ళిపోయారు. 

ఇంతా చేశాక ఇపుడు దానిని పూడ్చిపెట్టేసి, పోయింది  అంటే ఎవరు నమ్ముతారు. ఏమైనా చేసి కొత్త కాలిక్యులేటరు కొనాలి కొని తీరాలి అనుకుని ఆ విలన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయాను. తర్వాతి రోజు కాలేజీ కి కూడా తీసుకు వెళ్ళలేదు. 

కానీ ఆ రోజు ఇంటికి వెళ్లేసరికి కొత్త కాలిక్యులేటరు నిగనిగ లాడుతూ కనిపించింది. నా కోసమే కొన్నారట. ఆ వేళ పొద్దున నాన్న పాల వాడి లెక్క చూస్తే కాలిక్యులేటరు మూడు లక్షలు చూపించిందట!! అందుకే అది కాలిక్యు"లేటరు" అయింది ఎప్పుడు సమాధానం అడిగినా లేటర్ తెలిసేది కాబట్టి.

1 comment: